కాంగ్రెస్ అసమదీయులు, తసమదీయులెవరంటే

 

ఈరోజు ఆర్ధికమంత్రి చిదంబరం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మొత్తం సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, మంత్రులు అందరూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగుతారని అందరూ భావించారు. కానీ, కేంద్ర మంత్రులు జేడీ.శీలం, పనబాక లక్ష్మి, యంపీ బొత్స ఝాన్సీ తమ తమ సీట్లకే పరిమితమయి కాంగ్రెస్ అసమదీయుల లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకొనగా, మరో ఇద్దరు మంత్రులు పల్లంరాజు, కిల్లి క్రుపారాణిలు కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా అటు అధిష్టానానికి, ఇటు సమైక్యవాదులకు ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకొనేందుకు సభలో కనబడకుండా మాయమయిపోయారు. ఇంతవరకు అధిష్టానానికి విధేయులుగా ముద్రపడ్డ కేంద్రమంత్రులు కావూరి సాంభశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, యంపీ కనుమూరి బాపిరాజు మరియు పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన హర్షకుమార్ సోనియా గాంధీ వారిస్తున్నా వినకుండా స్పీకర్ పోడియం వద్ద నిలబడి ససమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తూ తసమదీయులుగా మారిపోవడం విశేషం.

 

మరో విశేషమేమిటంటే ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో చేసిన నిరసన దీక్షలో ఆయన పక్కన కూర్చొని దీక్ష చేసిన జేడీ.శీలం, బొత్స ఝాన్సీ లు సభలో మిన్నకుండిపోగా, మన రాష్ట్రంతో, విభజనతో ఎటువంటి సంబంధమూ లేని త్రిణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ యంపీలు సభలో ఆందోళన చేస్తున్ననలుగురు కేంద్రమంత్రులతో కలిసి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వారికి తమ మద్దతు తెలిపారు.

 

మొన్న లోక్ సభలో గొడవ జరిగినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తమ ఇతర రాష్ట్రాల యంపీలనే మార్షల్స్ గా చేసుకొని సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలపై దాడికి ప్రయోగించిందనే ఆరోపణలను గట్టిగా ఖండించింది. కానీ ఈరోజు చిదంబరం బడ్జెట్ ప్రసంగానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తమిళనాడు కు చెందిన కాంగ్రెస్ యంపీలను ఆయన చుట్టూ రక్షణ కవచంగా ఏర్పాటు చేయడం గమనిస్తే ఆ ఆరోపణలు నిజమేనని అర్ధమవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం బహుశః ఇందుకు సిగ్గుపడకపోవచ్చును. కానీ యావత్ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ దుస్థితికి జాలిపడుతున్నారు.