TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం విక్రయాల్లో మరింత పారదర్శకత: ప్రతి బాటిల్ స్కాన్ తరువాతే అమ్మకం.!

Published on: Wed Nov 25, 2026 10:49AM

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలలో  పారదర్శకతను పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.   మద్యం దుకాణాల్లో ప్రతి సీసాను స్కాన్ చేసిన తర్వాతే వినియోగదారులకు విక్రయించే నిబంధనను తీసుకురావాలని నిర్ణయించింది. కొన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయాలకు భిన్నంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించడం, కల్తీ మద్యంపై నెలకొన్న అపోహలను తొలగించడం, విక్రయాల లక్ష్యాలకు ఆటంకం కలగకుండా ప్రతి లావాదేవీపై స్పష్టమైన సమాచారం సేకరించడం లక్ష్యంగా ఏపీ ఎక్సైజ్ శాఖ ఈ నిబంధనలను రూపొందించింది.

ఈ కొత్త విధానం మేరకు  మద్యం దుకాణాలకు స్కానింగ్ యంత్రాలను అందజేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దుకాణదారులు సీసాను స్కాన్ చేయగానే సంబంధిత ఉత్పత్తి వివరాలు, ధర స్క్రీన్‌పై కనిపించడంతో పాటు యంత్రానికి ఉన్న స్పీకర్ ద్వారా ధర వినియోగదారుడికి స్పష్టంగా వినిపిస్తుంది. సాధారణంగా సూపర్‌మార్కెట్లలో కనిపించే ఈ విధానాన్ని ఇప్పుడు మద్యం దుకాణాలకు కూడా వర్తింప చేయడానికి ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ స్కానింగ్ యంత్రాల వినియోగానికి గాను మద్యం దుకాణ దారులు  నెల నెలా నిర్ణీత అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

మద్యం దుకాణాల పనివేళలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఖరారు చేయగా, స్కానింగ్ యంత్రాలు కూడా సరిగ్గా ఇదే సమయంలో పనిచేసేలా స్టాండర్డ్  సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. రాత్రి 10 గంటలు దాటిన వెంటనే యంత్రాలు ఆగిపోయి, తిరిగి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మాత్రమే పనిచేయడం ప్రారంభించేలా ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు.  దీనివల్ల నిర్ణీత వేళలకు ముందే ఉదయాన్నే లేదా రాత్రి సమయం దాటిన తర్వాత ఇష్టారీతిన మద్యం విక్రయించే అవకాశం ఉండదు. 

ప్రస్తుతం పలుచోట్ల   నిబంధనలకు విరుద్ధంగా పనివేళలతో సంబంధం లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే అనధికారికంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది.   కొత్త స్కానింగ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే అలాంటి అక్రమాలకు తావుండదు. ఏదైనా సీసాను స్కాన్ చేయకుండా విక్రయించినట్లు గుర్తిస్తే, ఆయా దుకాణ నిర్వాహకులు తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయి.

ఇది కూడా చదవండి:  AP: 807 మద్యం దుకాణాలకు లాటరీ.. అక్టోబర్ 5న డ్రా.!

స్కానింగ్ విధానం అమలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరిగే మద్యం అమ్మకాలకు సంబంధించిన రియల్‌టైమ్ సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుంది. ఏ దుకాణంలో, ఏ సమయంలో, ఏ బ్రాండ్ ఎంతమేర విక్రయించారనే వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడం వల్ల పర్యవేక్షణ   సులభతరం అవుతుంది. 

మొత్తంగా మద్యం విక్రయాల ప్రక్రియను డిజిటల్ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావడం ద్వారా నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.  నిర్ణీత సమయాల్లోనే అమ్మకాలు జరిగేలా చూడటం, ప్రతి సీసా విక్రయాన్ని నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని చెబుతోంది.  ఈ కొత్త విధానంపై త్వరలో  మరింత స్పష్టత రానుంది.

మీకు నచ్చవచ్చు:   మద్యం స్కాం అంతిమ లబ్ధిదారు జగనే.. కోర్టులో బేవరేజెస్ మాజీ ఓఎస్డీ వాంగ్మూలం.!

ఏపీ మద్యం టెండర్ల కేసు.. పీటీ వారెంట్‌ను తిరస్కరించిన కోర్టు.!

[Liquor shops, AP Excise Department, Bottle scanning, Liquor sale timings, realtime tracking, TeluguOne]