మోదీ హ్యాకింగ్ అస్త్రం ప్రయోగిస్తున్నారా?  


మన పురాణాలు తిరగేస్తే బోలెడు వింతలు కనిపిస్తాయి. అందులో ఒకటి దివ్య దృష్టి. కొందరు కూర్చున్న దగ్గరే కూర్చుంటూ ఎక్కడ ఏం జరిగినా అన్నీ చూసేసే వారు అప్పట్లో! కాని, నిజంగా అది సాధ్యమా? ఇప్పటి వారు చాలా మంది కాదనే అంటారు. కాని, పురాణాల కాలం మాట ఏమోగాని... ఇప్పుడు కూడా దివ్య దృష్టి వున్న వాళ్లు తయారైపోయారు. వీళ్లు కూడా కఠోర తపస్సు చేస్తారు. కాకపోతే, వీళ్లది దేవుడి కోసం తపస్సు కాదు. టెక్నాలజీ కోసం తపస్సు!


హ్యాకర్స్ అనగానే సాధారణంగా ప్రతీ ఒక్కరూ అలెర్ట్ అవుతారు! తమ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఎవరు హ్యాక్ చేస్తారో అన్న భయం ఇప్పుడు కామనైపోయింది. కాని, హ్యాకర్స్ బెడద మామూలు వారికంటే సెలబ్రిటీలకు ఎక్కువ. మన రహస్యాలు ఎన్ని లీకైనా పెద్దగా నష్టం వుండదు. మహా అయితే డబ్బులు కాజేయవచ్చు హ్యాకర్లు. కాని, సెలబ్రిటీల అకౌంట్లు ఈ సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. వాళ్లు ఎలాంటి రహస్యాలైనా బయటపెట్టి ఆటాడుకోవచ్చు. ఇప్పుడు అదే పరిస్థితిలో వున్నారు కొందరు ఇండియన్ సెలబ్స్!


కంప్యూటర్ , ఇంటర్నెట్, సాఫ్ట్ వేర్లు, నెట్ వర్క్ లు... ఇలాంటి వాటిపై పట్టు వుంటే ప్రపంచంలో ఎక్కడ కూర్చునైనా ఎక్కడి కంప్యూటర్ నైనా హ్యాక్ చేయవచ్చు. ఇప్పుడు అధునిక కాలంలో ఇదే దివ్య దృష్టిగా మారిపోయింది. అలా చేస్తున్న తాజా సంస్థే... లిజియన్ గ్రూప్. ఈ హ్యాకర్ల బ్యాచి మన దేశంలోని పెద్ద పెద్ద ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు వరుసగా హ్యాక్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయటంతో పాటూ రాహుల్ గాంధీ అధికారిక హ్యాండిల్ కూడా హ్యాక్ చేశారు. ఆ సంచలనం చల్లబడ్డక ముందే ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్ కుమార్ ల అకౌంట్లు కూడా ఈ లిజియన్ గ్రూప్ బారిన పడ్డాయి. 


లిజియన్ హ్యాకర్లు వాషింగ్ టన్ పోస్ట్ పత్రికతో మొబైల్ ఛాటింగ్ లో మాట్లాడుతూ అన్నిటికంటే పెద్ద బాంబు పేల్చారు. తమ వద్ద జయలలిత చికిత్స జరిగిన అపో అసుపత్రి సర్వర్ వివరాలు కూడా వున్నాయన్నారు. ఆమెకు చేసిన వైద్యంపై తమ వద్ద వున్న హ్యాక్ చేసిన ఆధారాలు బయటపెడితే దేశం గందరగోళం అవుతుందని వారు చెప్పారట! అంతగా కల్లోలం రేపే సీక్రెట్స్ అందులో ఏమున్నాయో ఇప్పటికైతే తెలియదు. కాని, ముందు ముందు లిజియన్ గ్రూప్ ఆ వివరాలు బయట పెడుతుందా? దీనికి వారు సూటిగా సమాధానం చెప్పలేదు. తమ వద్ద అపోలో సర్వర్ రహస్యాలు వున్నాయని మాత్రమే చెప్పారు. బయటపెడతారో లేదో తెలియదు... 


లిజియన్ హ్యాకర్లు ఇంత దాకా చేసిందే కాదు ఇక ముందు చేయబోయేది కూడా చెప్పారు. ఐపీఎల్ కమిషనర్ గా నానా రచ్చ చేసిన లలిత్ మోదీ అకౌంట్లు, కంప్యూటర్లు తమ నెక్ట్స్ టార్గెట్ అన్నారు. ఆయన గురించి ఎలాంటి సీక్రెట్స్ బయటపెడతారో మరి! కాకపోతే, ప్రస్తుతానికి లిజియన్ ఎవ్వరి గురించీ పెద్దగా సంచలన వివరాలేం బయటపెట్టలేదు. అంతకంటే ముఖ్యంగా, ఈ హ్యాకర్స్ బ్యాచ్ బీజేపి నేతలు, వారికి అనుకూలంగా వుండే సెలబ్రిటీల గురించి ఒక్క మాటా మాట్లాడకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా మోదీ సైబర్ టీమే చేస్తోందని ఆరోపణలు అప్పుడే మొదలైపోయాయి కూడా...