నల్ల కోటు లాయర్ కాదు... నల్ల నోట్ల లాయర్!

 

కోర్టులో వాదించే వార్ని ఇంగ్లీషులో అయితే లాయర్ అంటారు. తెలుగులో ఏమంటారు? న్యాయవాది! అంటే... న్యాయం వైపున నిల్చి, గెలిపించేవాడు అని అర్థం! కాని, ప్రతీ కేసులోనూ  న్యాయం వైపున ఒక లాయర్ వున్నట్టే అన్యాయం వైపున కూడా మరో లాయర్ వుంటాడు. ఈ లెక్కన సగం మంది లాయర్లు అన్యాయవాదులన్నమాట! ఇలాంటి లాజిక్ పక్కన పెట్టేసి ఆలోచించినా కూడా ఢిల్లీలోని ఓ లాయర్ నిర్వాకం చూస్తే మనకు దిమ్మతిరిగిపోతుంది. అసలు అలాంటి పనులు చేస్తూ నల్ల కోటు వేసుకున్న వార్ని న్యాయవాదులు అనవచ్చా అన్న అనుమానం కలుగుతుంది. అన్యాయవాదులు అన్న పదమే వాళ్లకి కరెక్ట్... 


అనగనగా రోహిత్ టాండన్ అని ఓ ఢిల్లీ లాయర్. ఈయనెవరో రాం జెఠ్మలానీ లాంటి ప్రముఖ, ప్రసిద్ధ న్యాయవాది అనుకోకండి! ఓ మామూలు చిన్న చిన్న కేసులు టేకప్ చేసే సాదాసీదా లాయర్. కాని, అంతా అలా అనుకుంటున్న సమయంలోనే రోహిత్ టాండన్ ఎంతటి ప్రబుద్దుడో అందరికీ తెలిసిపోయింది. గత అక్టోబర్ లో తొలి సారి మనోడి ఇళ్లు, ఆఫీసు లాంటి వాటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. గట్టి నిఘా పెట్టి టాండన్ గారి నల్ల వ్యవహారం పసిగట్టిన ఐటీ అదే రేంజ్లో ఎటాక్ చేసింది. ఫలితంగా ఒకేసారి 125కోట్లు దొరికాయి! తరువాత ఈ మధ్య కాలంలో రెండు వారాల కిందట ఆదాయ పన్ను శాఖ రెండో సారి దాడులు చేసింది. అప్పుడు 19కోట్లు లభించాయి దొరగారి దగ్గర నుంచి. 


తాజాగా... ముచ్చటగా మూడోసారి దాడి చేసిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కి మళ్లీ భీభత్సంగా బ్లాక్ మనీ దొరికింది. పాత 500, 1000 నోట్లు కాదు కొత్త 2వేల నోట్లు కూడా భారీగా దొరికాయి! ఎంత అనుకుంటున్నారు? సామాన్య జనానికి ఒక్క రెండు వేల నోటు కూడా దొరకని కరువు కాలంలో మనోడి వద్ద ఏకంగా 2కోట్ల 61లక్షల విలువైన నోట్లు వున్నాయట! ఇంత అక్రమ సంపాదన కలిగిన ఈ రోహిత్ టాండన్ సుప్రీమ్ కోర్టులో హై ప్రొఫైల్ కేసులు వాదించే వాడేమీ కాదట! అయినా ఇంత నల్ల సొమ్ము ఈ నల్ల కోటు శాల్తీ వద్ద ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు! అయినా... డబ్బు సంపాదించటం అనే టాలెంట్ వున్న వాడికి మరో స్పెషల్ టాలెంట్ అవసరమా చెప్పండి?