సీపీఎం కటీఫ్.. అదే బాటలో సీపీఐ.. కాంగ్రెస్ వామపక్షాల పొత్తు అనుమానమే?

కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సీపీఐ, సీపీఎం చెరోదారీ కానున్నాయి. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో అలకబూనిక సీపీఎం కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేసింది. ఆ పార్టీ రాష్ట్రంలో ఒంటరిగా ఐదు నుంచి ఎనిమిది స్థానాలలో పోటీకి రెడీ అయిపోతోంది. ఈ విషయంపై  బుధవారం (నవంబర్1) జరిగే సీపీఎం కార్యవర్గ సమావేశం తరువాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇలా ఉండగా అదే రోజు సీపీఐ కార్యవర్గ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఆ సమావేశాలలో సీపీఐ కాంగ్రెస్ తో కలిసి వేళ్లే విషయంపై తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సీపీఎం తన అసంతృప్తిని ఇప్పటికే బహిర్గతం చేయగా, సీపీఐ మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నది. ఆ పార్టీ కోరుతున్న విధంగా ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు సీట్లను కూడా కాంగ్రెస్ కేటాయించే అవకాశాలు కనిపించకపోవడంతో సీపీఎం కూడా తన దారి తాను చూసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

వామపక్షాలతో పొత్తు విషయంలో కాంగ్రెస్ ముందు వెనుకలాడటానికి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీలు అధిక స్థానాలు కోరుతుండటమే కారణంగా కనిపిస్తోంది. వామపక్షాలు కోరుతున్న స్థానాలను కాంగ్రెస్ కేటాయించే విషయంలో సందిగ్ధత నెలకొనడానికి ఆయా నియోజకవర్గాలలో పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి వస్తున్న వ్యతిరేకతే కారణంగా చెప్పవచ్చు. సీపీఎం తన బలాన్ని మించి స్థానాలు కోరుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్ లో బలంగా ఉంది. అందుకే ఆ పార్టీ డిమాండ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించి.. ఆ పార్టీ కోరుతున్న స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఇక సీపీఐ విషయంలో  కాంగ్రెస్ కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ కోరుతున్నట్లుగా కొత్తగూడెం స్థానాన్ని కేటాయించేందుకు ఒకింత తటపటాయిస్తోంది.

ఎందుకంటే బీఆర్ఎస్ ను రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావు కొ త్తగూడెం స్థానాన్ని ఆశిస్తున్నారు. బలమైన నాయకుడు కావడంతో ఆయనను పార్టీ అభ్యర్థిగా కొత్తగూడం నుంచి నిలబెడితే గెలుపు నల్లేరుమీద బండినడకే అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో సీపీఐకి సీట్ల కేటాయింపు విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో ఒకింత అసంతృప్తి చెందిన సీపీఐ కూడా కార్యవర్గ సమావేశంలో కాంగ్రెైస్ తో కలిసి వేళ్లాలా? వద్దా అనే విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా వామపక్షాలతో పొత్తు లేకపోయినా తమ విజయానికి ఢోకా ఉండదన్న భావన కూడా కాంగ్రెస్ లో బలంగా వ్యక్తం అవుతుండటంతో.. వామపక్షాలతో పొత్తు అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu