రమణ అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా

 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నది విదితమే.అయితే తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలలో నిమగ్నమవ్వటంతో తెలంగాణలో ఆ పార్టీ బాధ్యతలను టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణకు అప్పగించారు.మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సహా పార్టీ గెలుపు కొరకు అన్ని భాద్యతలను రమణ తన భుజస్కందాలపై మోస్తున్నారు.అయితే  రానున్న ఎన్నికల్లో రమణ మాత్రం పోటీ నుంచి తప్పుకొన్నారు. రాష్ట్రంలో మహాకూటమిని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. ఇకనుంచి కూటమిభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నారు. జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా నిలిచారు.1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి గెలిచిన రమణ మంత్రిగా పనిచేశారు. అక్కడి నుంచి ఐదుసార్లు పోటీ చేసినా కేవలం రెండు సార్లు మాత్రమే శాసన సభలో కి అడుగు పెట్టారు.అయితే పొత్తు ధర్మం ప్రకారం గెలిచేవారికే సీటు ఇవ్వనుండటం అంతే కాకుండా జీవన్ రెడ్డి రమణకు రాజకీయంగా గురువు కావటంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.పోటీ నుంచి రమణ తప్పుకున్నా మహాకూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.