కొణతాలకు వైకాపా నుండి త్వరలో ఉద్వాసన

 

ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కళంకిత మంత్రులను పార్టీలోకి ఆకర్షించేందుకు గాలం వేస్తున్న వైకాపా, మరో వైపు పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉన్న కొణతాల రామకృష్ణను అదే కాంగ్రెస్ పార్టీకి అప్పగించేందుకు సిద్దం అవుతుండటం విశేషం. దాడి వీరభద్రరావు వైకాపాలో చేరినప్పటి నుండి కొణతాల రామకృష్ణ పార్టీ కార్యక్రమాలకి, సమావేశాలకి కూడా దూరంగా ఉంటున్నారు. తమ రాజకీయ ప్రత్యర్ధిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన తన అసంతృప్తిని పార్టీ అధిష్టానానికి చాలా స్పష్టంగానే తెలియజేసారు. అయినా కూడా జగన్, దాడి వీరభద్రరావుకే ప్రాధాన్యతనీయడంతో కొణతాల వర్గీయులు అందరూ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

 

ఈ సమస్యను పరిష్కరించేందుకు జగన్ తన దూతలుగా సోమయాజులు, సుబ్బారెడ్డి తదితరులను పంపినప్పటికీ, కొణతాల దాడితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడమే కాకుండా, చంచల్ గూడా జైలుకి వెళ్లేందుకు కూడా అయిష్టత చూపడంతో సమస్య పరిష్కారం కాలేదు.

 

దానితో తీవ్ర ఆగ్రహం చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీలో తన నిర్ణయాలను, ఆదేశాలను మన్నించనివారు వెంటనే తప్పుకోవడం మేలని గాటుగా ఒక సందేశం పంపడమే కాకుండా, దాడి వీరభద్రరావు రాకను నిరసిసస్తూ ఇటీవల కొణతాల సోదరుడు లక్ష్మినారాయణ మరియు ఆయన అనుచరులు సమావేశం నిర్వహించినందుకు, రామకృష్ణతో సహా వారందరికీ కూడా సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపినట్లు తాజా సమాచారం.

 

నోటీసుల వరకు వచ్చిన కధలో సాధారణంగా సదరు నోటీసులు అందుకొన్న నేతలు పార్టీ నుండి బహిష్కరించబడినట్లే భావిస్తారు. కనుక కొణతాల రామకృష్ణ కూడా ఇంక మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొంటారేమో.

 

అటు కాంగ్రెస్ నుండి ధర్మాన, సబితలు వైకాపాలోకి వస్తే, ఇటు నుండి కొణతాల ఆయన సోదరుడు లక్ష్మి నారాయణ కాంగ్రెస్ పార్టీలోకి వేళతారేమో? కొణతాల రామకృష్ణకు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరికి ఉన్న విబేధాలు కూడా ఆయన ఉద్వాసనకు మరో కారణమని తెలుస్తోంది.