అన్నదమ్ములు ఇద్దరిదీ ఒకటే మాట

 

నల్లగొండ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పైగా అన్నదమ్ములు వారే కోమటి రెడ్డి వెంకటరెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.ఎన్నికలు ఎప్పుడొచ్చినా వీరిద్దరికి టిక్కెట్ కేటాయించటం మాత్రం పక్కా.అయితే రానున్న ఎన్నికల్లో 
టీఆర్ఎస్ ని గద్దె దింపటానికి కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ అయితే పూర్తి కాలేదుగాని పొత్తు ధర్మం ప్రకారం గెలిచే వారికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే కుటుంబం ఒకే టిక్కెట్ అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలని నిశ్చయించుకుంది.కానీ వీరిద్దరికి నల్లగొండ జిల్లాలో మంచి పేరు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించక తప్పదు.అయితే వీరిద్దరు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయనంటున్నారు.ఎందుకంటే పొత్తులో భాగంగా నకిరేకల్‌ స్థానాన్ని కూటమిలోని ఇతర పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది.అయితే కొన్ని రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ..నకిరేకల్‌ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పార్టీ అధిష్ఠానం టికెట్‌ ఇవ్వకపోతే తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

తాజాగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి నార్కట్‌పల్లిలో ప్రచారానికి వెళ్లగా ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ నకిరేకల్‌ టికెట్ చిరుమర్తికి ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. పొత్తుల పేరుతో నకిరేకల్‌ను వేరొకరికి ఇస్తే చూస్తూ ఉరుకోమన్నారు. జరగబోయే పరిణామాలకు ఉత్తమ్‌, జానారెడ్డి బాధ్యత వహించాలని కోమటిరెడ్డి తేల్చిచెప్పారు.ఎంత పేరున్న నేతలైతే మాత్రం పొత్తు ధర్మాన్ని కాదంటే పార్టీ ఊరుకుంటుందా? పైగా ఒకే కుటుంబం ఒకే టిక్కెట్ సిద్ధాంతాన్ని సైతం పక్కన పెట్టి అన్నదమ్ములకు టిక్కెట్ కేటాయిస్తుంది ఆలా అని వేరొకరికి కూడా టిక్కెట్ ఇమ్మని డిమాండ్ చేస్తే పార్టీ ఎలా స్పందిస్తుందో?