ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.!
Published on: Fri Nov 6, 2026 3:47PM

ఆంధ్రప్రదేశ్ లోకియా ఇండియా విస్తరణకు రంగం సిద్ధమైంది. కియా సంస్థ ఏపీలో భారీగా తన ప్లాంట్ ను విస్తరించడానికి1.5 బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో దాదాపు 14 వేల 167 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఆటోమొబైల్ రంగానికి ఊతమివ్వనుంది.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ పూర్తయితే అనంతపురం ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 5 లక్షల వాహనాలకు చేరుకుంటుందని అంచనా.
ఈ పెట్టుబడి కేవలం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికే కాకుండా, ప్లాంట్‌లో సరికొత్త ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగపడనుంది. దీని ద్వారా మార్కెట్లోకి కొత్త మోడల్స్‌ను తీసుకురావడంతో పాటు, వివిధ రకాల పవర్‌ట్రెయిన్ కాంబినేషన్లతో కూడిన నూతన వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది కియా లక్ష్యంగా చెబుతున్నారు. అలాగే స్థానిక సప్లయర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా వృద్ధికి బలమైన బాటలు వేయాలని కంపెనీ భావిస్తోంది.

విశాఖపట్నం వేదికగా త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఈ విస్తరణ ప్రణాళికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే ఈ ఇన్వెస్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో కియా యాజమాన్యం ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు సమాచారం. భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడంలో ఈ పెట్టుబడి కీలక పాత్ర పోషిస్తుందని కియా చెబుతోంది.
ఇది కూడా చదవండి: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. రష్యా వేదికగా నారా లోకేష్!
అనంతపురం ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన నాటి నుంచి కియా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ అదనపు పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఏపీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి ఈ పెట్టుబడి ఒక మైలురాయిగా నిలవనుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 2.!
రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ.!
[Kia India investment Anantapur, Andhra Pradesh Manufacturing Plant, Investment, AP Investor Summit Visakhapatnam, Telugu One]


