ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. రష్యా వేదికగా నారా లోకేష్!

posted on: Jun 5, 2026 10:03AM

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నగరం వేదికగా జరిగిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  ప్రసంగంతో  అందరినీ ఆకట్టుకుంది.  నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పంథాను ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు వివరిస్తూ..  రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే వ్యూహాత్మక ప్రణాళికను ఆయన ఈ ఫోరం వేదికగా  ఆవిష్కరించారు. కేవలం పెట్టుబడిదారులుగా మాత్రమే కాకుండా, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తులో అత్యంత నమ్మకమైన, దీర్ఘకాలిక భాగస్వాములుగా పాలుపంచుకోవాలని నారా లోకేష్  రష్యా పారిశ్రామికవేత్తలను, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించారు.

భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న మైత్రిని గుర్తు చేస్తూ. . ఈ రెండు దేశాల బంధం కేవలం వ్యాపార ఒప్పందాలకే పరిమితం కాదనీ, అది ఒక దృఢమైన చారిత్రక అనుబంధమని  పేర్కొన్నారు.  గతంలో భిలాయ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం నుండి నేటి ప్రతిష్టాత్మక గగన్‌యాన్ అంతరిక్ష ప్రాజెక్టు వరకు ఎన్నో కీలక మైలురాళ్లలో రష్యా   భారతదేశానికి ఒక బలమైన అండగా నిలిచిందన్న లోకేష్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ,  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్దేశించుకున్న సరికొత్త ఆర్థిక మైలురాయిని  ప్రస్తావించారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవాలనే భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్   కీలక భాగస్వామిగా, చోదక శక్తిగా మారబోతోందన్నారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన దార్శనికతతో కూడిన లీడర్ షిప్ లో రాష్ట్రం శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోందని చెప్పారు.  ఒక సుదీర్ఘకాల ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, భారత శతాబ్ది ఉత్సవాల వేళ అంటే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీని  2.5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ  సంకల్పమని లోకేష్ తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ఏపీలో ఉన్న అనుకూలతలు మరే రాష్ట్రంలోనూ లేవని  గణాంకాలతో సహా వివరించిన లోకేష్..   వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సుదీర్ఘమైన సముద్ర తీరప్రాంతం, వ్యూహాత్మక ప్రాంతాలలో నిర్మితమైన ఆరు ప్రధాన ఓడరేవులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నిరంతరాయంగా లభించే పారిశ్రామిక విద్యుత్ సరఫరా వంటి అద్భుతమైన అంశాలు ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాయన్నారు.

పాత పద్ధతులకు స్వస్తి పలికి, తమ కూటమి ప్రభుత్వం  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను దాటి  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  విధానానికి  ప్రాధాన్యత ఇస్తోందనీ, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను రికార్డు సమయంలో మంజూరు చేస్తామని రష్యన్ ఇన్వెస్టర్లకు లోకేష్ భరోసా ఇచ్చారు.

ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం ఇప్పుడు  కొత్త శిఖరాలకు చేరుతోందనీ,  లోకేష్ వ్యాఖ్యానించారు. ఇండియాలోని ఏకైక  స్పేస్‌పోర్ట్ అయిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం   ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం   రాష్ట్రానికి దక్కిన గొప్ప వ్యూహాత్మక లబ్ధిగా అభివర్ణించారు. ఈ అద్భుతమైన నేపథ్యాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో సరికొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడ్రన్  స్పేస్ సిటీలలో పెట్టుబడులు పెట్టాలని ఆయన రోస్‌కోస్మోస్ వంటి దిగ్గజ స్పేస్ ఏజెన్సీలకు,  అనుబంధ పరిశ్రమలకు పిలుపునిచ్చారు. వీటితో పాటు ఏరోస్పేస్, అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీ, క్లీన్ ఎనర్జీ,  గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్తు ఇంధన రంగాల్లో రష్యన్ పారిశ్రామిక సంస్థలకు ఏపీలో అపారమైన అవకాశాలు వేచి ఉన్నాయని లోకేష్ చెప్పారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...