తుని ధ్వంస రచన ఎవరి పాపం?

గోదావరి జిల్లా అంటేనే ప్రశాంతతకు మారుపేరుగా కనిపిస్తుంది.  ఆ ప్రశాంతత కాస్తా ఆదివారం భగ్నమైంది. సామాన్య జనంలో బీభత్సం  నింపింది. ఒక వర్గాన్ని బీసీల్లోకి చేర్చాలన్న ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారింది. పోలీసులు పాటించిన సంయమనం వారి అసమర్ధతగా మారింది. జాతీయ రహదారికీ, రైల్వేప‌ట్టాల‌కీ దగ్గరలోకి సభ వేదిక ఎవరి సలహా మీదనో  చివరి క్షణంలో మారింది. ఈ మార్పు వెనుక ఉద్దేశం ఇదేనని అన్ని వర్గాలూ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాయి. ఉద్రిక్తతని కొనసాగించేందుకు, ధ్వంసరచన  చేసేందుకు కాకినాడ కంటే ఇది అనువైన వేదిక అయ్యింది. ఆందోళనకారులకి తగిన అవకాశాలు చిక్కాయి. విజయవాడకి వెళ్తున్న  రత్నాచల్ ఎక్స్ ప్రెస్‌ అప్పుడే అక్కడికి చేరుకోవడంతో, ఉద్యమకారుల కోపానికి అది బలైంది. అయితే నిజానికి ఇది ఉద్యమకారుల  మనోగతం కాదని, ఏడెనిమిది వాహనాల్లో వచ్చిన ముష్కరుల అఘాయిత్యమని ఒక్కటొక్కటే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.  అదృష్టం  కొద్దీ ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.  ఏం జరుగుతోందో తెలియని పిల్లలు, ఏం జరగబోతోందో అన్న భయంతో మహిళలు  కళ్లనీళ్లు కుక్కుకుని నిస్సహాయంగా ఉండిపోయారు. రత్నాచల్ కాలి బూడిదైనా ఉద్యమకారుల  ముసుగులోని ముష్కరుల ఎజెండా అక్కడితో  పూర్తి కాలేదు.  ఊరిలో ఉన్న పోలీస్స్టేషన్లను తగలబెట్టుకుంటూ ముందుకు సాగిపోయారు.  


త‌మ‌ను బీసీలలో చేర్చే విషయంలో అధికార పక్షం ప్రదర్శించే నాన్చుడు ధోరణి ప్రద‌ర్శిస్తోంద‌న్నది  ఒక వ‌ర్గ నాయ‌కులు చేస్తున్న ప్రధాన  ఆరోప‌ణ‌. వారిలో ఇలాంటి అసంతృప్తి మొదలైన ప్రతిసారీ కొంద‌రు నేతలు దానిని ఉద్యమస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూనే  వ‌చ్చారు. అయితే ఈసారి అదే స్ఫూర్తితో మొద‌లైన స‌భ‌ కాస్తా నిమిషాల్లో ఉద్రిక్తంగా మారిపోయింది. మైకు అందుకున్న కొద్ది నిముషాల్లోనే  నేతల స్వరం మారిపోయింది. ప్రభుత్వం దిగివచ్చే దాకా రైలు పట్టాల మీద నుంచి కదలవద్దంటూ ముద్రగడ అందరినీ రైలు  పట్టాల వైపుకి బయల్దేరదీశారు. రైలుపట్టాల మీద బైఠాయిస్తే ఆ ప్రభావం మొత్తం దేశం అంతటా ఉంటుంది. రాజస్థాన్లోని గుర్జర్లనే కులంవారు  కూడా ఇలాగే రైళ్ల రాకపోకలని నిలిపివేసి దేశం దృష్టిని ఆక‌ర్షించారు. అయితే వారు హింసకు పాల్పడలేదు. ఏ ఉద్యమం అయినా హింసతో తమ లక్ష్యం సాధించుకున్న దాఖలాలు మనకు దేశంలో ఎక్కడా కనిపించవు. కాబట్టి ఉద్యమం హింసాబాట పడితే అది ఆ వర్గం వారి ప్రయోజనలనే దెబ్బ తీస్తుంది.  పద్మనాభంగారు ఈ వాస్తవం నేడు కాకున్నా రేపైనా గుర్తిస్తారని కోరుకుందాం.


నిజానికి నిన్నటి సంఘ‌ట‌న‌ వెనుక ఉన్నది.. దీన్నంతటినీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలన్న కుతంత్రంతో ఉన్న  దుర్మార్గులేనని ప్రత్యక్ష సాక్షుల క‌థ‌నం. రిజ‌ర్వేష‌న్ల ఆందోళ‌నకు దిగిన వ‌ర్గం రోజురోజుకీ అధికార టిడిపీకి  ద‌గ్గర‌వుతోంద‌నీ, వాళ్లని అధికార ప‌క్షం నుంచి దూరం చేసేందుకు ప్రతిపక్ష వ‌ర్గాల‌న్నీ ప్రయ‌త్నిస్తున్నాయ‌నేది ఒక అనుమానం. పైగా  హామీ గురించి ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులూ జర‌ప‌కుండా, ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఒక్కసారిగా  విధ్వంసాన్ని సృష్టించ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్నదే అందిరిలో మెదుల్తున్న అనుమానం. ఇప్పటి వ‌ర‌కు ఓసీల‌లో ఉన్న  వ‌ర్గాన్ని  బీసీల‌లో చేర్చడం అస్నది అంత సుల‌భ‌మైన ప్రక్రియ కాదు. అందుకోసం ఒక క‌మీష‌న్‌ను ఏర్పాటు చేయాలి. ఆ క‌మీష‌న్ సూచ‌న‌ల  ఆధారంగా రాజ్యంగాబ‌ద్ధంగా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించాలి.  నిజానికి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కమిషన్ ఏర్పాటు కూడా చేసింది.. అలా కాకుండా ఏక‌పక్షంగా నిర్ణయం తీసుకుంటే  అది ఉన్నత  న్యాయ‌స్థానంలో వీగిపోయే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఇలా హడావుడిగా కేవలం రాజకీయ లబ్ధి కోసం  క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్ లను  న్యాయ‌స్థానాలు కొట్టివేసి, ప్రభుత్వాలకు ముక్కచివాట్లు పెట్టిన సంద‌ర్భాలు కోకొల్లలు.. ఇదంతా కూడా ప్రజలకు, ఉద్యమ నాయ‌కుల‌కు, ఇతర ప్రతిపక్షాలకూ  తెలియ‌కుండా ఉండి ఉంటుందా! లేక తెలిసి కూడా తమ ప్రాభ‌వాన్ని పెంచుకోవ‌డం కోసం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఈ చర్యకు పాల్పడ్డారా అనేది వారికే  తెలియాలి.  ఏమైనా ఇలా కుల ప్రాతిపదికన సమాజాన్ని విడదీయడం నిప్పుతో చెలగాటమాడటమే. కులమతాల ప్రాతిపదికన సమాజాన్ని విభజించి పబ్బం గడుపుకునే కుటిల రాజకీయం  దేశ‌ స‌మైక్యతనే దెబ్బతీసే ప్రమాదం ఉంది. సున్నిత‌మైన కులాల‌,  మ‌తాల ప్రస్తావ‌న  అమాయ‌క‌ ప్రజల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అలాంటి ప‌రిస్థితి రాకముందే స్థానిక నేత‌లు,  కుల‌పెద్దలు సమస్యను వివేకంతో పరిష్కరిస్తారని ఆశిద్దాం..