రాష్ట్రపతి పాలన సరైన నిర్ణయమేనా!

మన దేశం ఈ నెల 26న తన 67వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఇదే రోజున అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలను విధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక ప్రాంతంలో రాష్ట్రపతి పాలనను విధించడం మన దేశంలో కొత్తేమీ కాదు. ఇప్పటికి దాదాపు 90 సార్లు మనం ఆ పరిస్థితిని చూశాము. కానీ అలాంటి పాలనను విధించిన ప్రతిసారీ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందన్న అపకీర్తిని ఎదుర్కోవడమే బాధాకరం! రాష్ట్రపతి పాలనను దుర్వినియోగపరచకుండా ఉండేందుకు సుప్రీం కోర్టు 1994 సంవత్సరంలో ‘S.R. Bommai v. Union of India’ కేసులో కొన్ని సూచనలు చేసింది. అప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా రాష్ట్రపతి పాలనను విధించిన సందర్భాలు తగ్గిపోయాయి. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించడంతో ఇలాంటి నిర్ణయాల వెనుక ఉండే న్యాయాన్యాయాల చర్చ మళ్లీ మొదలైంది.

సుదీర్ఘ కాలం ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సందర్భాలలో అతి సులువుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ని ఉపయోగించి రాష్ట్రపతి పాలనను విధించేది. కేంద్రానికి అనుకూలం కాని ప్రభుత్వం ఏమున్నా సరే, 356 అధికరణాన్ని ఉపయోగించి తొలగించి వేసే పరిస్థితులు ఉండేవి. ఒక్కసారి వెనక్కి తిరిగి రాష్ట్రపతి పాలనను విధించిన సందర్భాలను పరిశీలిస్తే, ఈ విషయం స్పష్టమైపోతుంది. శాసనసభలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి, రాష్ట్రంలోని శాంతిభద్రతలు హాయిగా ఉన్న సందర్భాలలో కూడా రాష్ట్రపతి పాలన విధించడం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తుంది. ఇప్పడు అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకోవల్సిన పరిస్థితులు వచ్చాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ చిన్న రాష్ట్రమే అయినా చాలా కీలకమైన ప్రదేశం. ఈ రాష్ట్రం మీ పట్టు సాధించేందుకు ఇటు ఉల్ఫా వంటి తీవ్రవాద సంస్థలూ, అటు చైనా వంటి సరిహద్దు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో గవర్నరు రాజ్‌కొవా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నివేదికలు ఇవ్వడం, వాటిని కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆమోదించి రాష్ట్రపతి పాలనను విధించడం జరిగిపోయాయి. నిజానికి గవర్నరు మీద ‘పరిపాలనలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నా’రంటూ ఆరోపణలు వచ్చాయి. గవర్నరే స్వయంగా అధికార పార్టీ సభ్యులలో చీలిక తెచ్చి, ముఖ్యమంత్రి మీదకు ఉసిగొలిపేందుకు ప్రయత్నాలు చేశారంటారు. ఇలా గవర్నరుకీ, ముఖ్యమంత్రికీ మధ్య మొదలైన వివాదం కాస్తా ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఎసరు పెట్టింది.

ఇందులో కేంద్ర ప్రభుత్వపు తప్పు ఉన్నా లేకున్నా గవర్నరు పాత్ర మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. మరి ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పడు ఆసక్తికరమైన ప్రశ్న! భవిష్యత్తులో రాష్ట్రపతి పాలనను విధించే ముందు కేంద్రం మరింత జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ సమస్య నేర్పే పాఠం. అక్కడ తమకు అనుకూలం కాని ప్రభుత్వం ఉందనో, గవర్నరుగారికి అక్కడి పరిస్థితులు నచ్చలేదనో కాకుండా నిజంగా అక్కడి శాంతిభద్రతలను, ప్రభుత్వపు నిలకడను పరిశీలించి… పరిస్థితులను చక్కదిద్దలేని సందర్భాలలో మాత్రమే రాష్ట్రపతి పాలనను విధించడం దేశానికి శ్రేయస్కరం! లేకపోతే ఇలాంటి నిర్ణయాలు దేశ సార్వభౌమాధికారానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది.