తెరపైకి రాయలసీమ రాష్ట్రం... కలకలం రేపుతోన్న జేసీ కామెంట్స్...

జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, లేని పక్షంలో... గ్రేటర్ రాయలసీమను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదన్న జేసీ దివాకర్ రెడ్డి... ఒకవేళ రాజధాని మార్పు జరిగితే మాత్రం తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ రాయలసీమ వాదాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన జేసీ... రాజధాని వివాదంపై చర్చించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో గ్రేటర్ రాయలసీమను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమం సమయంలోనూ రాయలసీమ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తనదైన వాదనలు వినిపించారు. మిగతా రాయలసీమ నేతలకు భిన్నంగా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆనాడు కోరారు. అప్పటి కేంద్ర పెద్దలతోనూ జేసీ ఆనాడు చర్చించారు. లేదంటే, అనంతపురం జిల్లా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కర్నాటకలోనైనా కలపాలని అప్పట్లో జేసీ డిమాండ్ చేశారు. అయితే, అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జేసీ కోరిక నెరవేరకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయింది.

అయితే, ఇప్పుడు రాజధాని వివాదం నడుస్తున్నవేళ మరోసారి రాయలసీమ వాదాన్ని జేసీ దివాకర్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని... లేదంటే... గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలంటూ డిమాండు చేయడంతో జేసీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.