బ్యాలెట్ విధానం... పార్టీల గుర్తులపై... మున్సిపోల్స్ పై మరో క్లారిటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగనున్నాయి. అలాగే, ఆయా అభ్యర్ధులు... తమతమ పార్టీల గుర్తులపైనే పోటీపడనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, వైసీపీతోపాటు గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమతమ గుర్తులపైనే పోటీ చేయనున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్ధులంతా ఆయా సింబల్స్‌‌పైనే పోటీ చేస్తారు. అయితే, గుర్తింపు లేని పార్టీలు... ఇండిపెండెంట్స్‌ కోసం 50 సింబల్స్‌ను అధికారులు ఎంపిక చేశారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, తిరస్కరణలు, ఉపసంహరణ... ఇలా మొత్తం నామినేషన్ల ప్రక్రియ పూర్తయి... అభ్యర్ధుల తుది జాబితా ఫైనలైజ్ అయ్యాక ఆయా అభ్యర్ధులకు గుర్తులను కేటాయించనున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో 53లక్షల 63వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 800మందికి ఒకటి చొప్పున మొత్తం 6వేల 625 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, ఎన్నికల నిర్వహణ కోసం 40వేల మంది సిబ్బందిని వినియోగించబోతున్నారు. ఇక, ఓటర్లు... తమది ఏ పోలింగ్‌ స్టేషన్లో తెలుసుకునేలా టీపోల్‌ యాప్‌ను ఎన్నికల అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయితే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశాలిచ్చింది. మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్  కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఉత్తమ్... హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.