TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేషనల్ కాన్ఫరెన్స్ లో ముదిరి పాకాన పడ్డ ముసలం: ఎంపీ రాజీనామా, ఎమ్మెల్యేల తిరుగుబావుటా.!

Published on: Sat Nov 14, 2026 5:27PM

జమ్మూ కాశ్మీర్  లో అధికార పక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో సంక్షోభం ముదిరి పాకాన పడింది. ఆ పార్టీలో వారం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు పరిణామాలు ముఖ్యమంత్రి  ఒమర్ అబ్దుల్లాకు ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించాయి.  ఒకవైపు ఆ పార్టీ సీనియర్ నేత, శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ సిద్ధాంతపరమైన కారణాలతో తన లోక్ సభ సభ్యత్వానికీ, అలాగే  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.  మరోవైపు దాదాపు 25 మంది నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థాకరణ కోసం సీఎం ఒమర్ అబ్దుల్లాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బడ్గామ్‌లోని బెహిష్త్ ఎ జెహ్రా పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో రుహుల్లా మాట్లాడుతూ, తన తండ్రి మరణించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం   పదవిని త్యజిస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తిరుగుబావుటా  ఎగురవేయడం జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.    

రుహుల్లా రాజీనామా ప్రకటనకు మూడు రోజుల ముందు నుంచే పార్టీలో అసమ్మతి జ్వాలలు రాజుకున్నాయి. అక్టోబర్ 30న నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే కైసర్ జమ్షీద్ లోన్ నివాసంలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా, మరో ఏడుగురు ఆన్‌లైన్ వేదికగా భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ ముఖ్యమంత్రితో సహా ఎనిమిది మంది మంత్రులను తొలగించాలనీ,  అలాగే ముఖ్యఒక మెమోరాండం ఇచ్చారు. అందులో  తమ డిమాండ్ల పరిష్కారానికి పక్షం రోజులు గడువు విధించారు.  గడువు విధించారు. గడువు లోపు స్పందించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తామని  హెచ్చరించారు.  ఇక ఆగా రుహుల్లా రాజీనామా వెనుక భావోద్వేగ, రాజకీయ సంకేతాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన రాజీనామా లేఖను 2010లో భద్రతా దళాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు తుఫైల్ మట్టూ తండ్రి ముహమ్మద్ అష్రఫ్ మట్టూ చేతుల మీదుగా అందించడం ద్వారా ఆయన తన అసంతృప్తిని బలంగా వ్యక్తపరిచారు.  ఆర్టికల్ 370 పునరుద్ధరణ, రిజర్వేషన్ల అంశం, రాష్ట్ర హోదా సాధన,  రాజకీయ ఖైదీల విడుదల వంటి ఎన్నికల హామీలను అమలు చేయడంలో సొంత ప్రభుత్వం విఫలమవుతోందని రుహుల్లా గత కొంతకాలంగా బాహాటంగానే  విమర్శిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి నివాసం వెలుపల నిరసన తెలపడంతో పాటు, ఆగస్టులో జరిగిన బడ్గామ్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపిన రాజీనామా లేఖలో రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావిస్తూ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.    

అయితే, రుహుల్లా ఆరోపణలను,  ఎమ్మెల్యేల తీరును నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వం తేలికగా కొట్టేసింది. రుహుల్లా రాజీనామాను  నైతిక మరియు మానసిక దివాళాకోరుతనం గా అభివర్ణించిన నేషనల్ కాన్ఫరెన్స్, పార్లమెంటులో ఆయన ప్రత్యేక హోదా కోసం కనీసం ఒక్క తీర్మానమైనా ప్రవేశపెట్టారా అని ఎదురు దాడికి దిగింది. అలాగే  ఎమ్మెల్యేల అసమ్మతి సమావేశాన్ని పార్టీ కాశ్మీర్ ప్రాంత అధ్యక్షుడు షౌకత్ మీర్ ఒక సాధారణ అనధికారిక భేటీగా కొట్టిపారేశారు. కేంద్ర పాలిత ప్రాంత నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి కేవలం ఎనిమిది మందిని మాత్రమే మంత్రులుగా నియమించగలరని, రాష్ట్ర హోదా పునరుద్ధరించబడితేనే   24 మందికి అవకాశం ఉంటుందని ఆయన వాస్తవ పరిస్థితిని వివరించారు. బడ్గామ్‌లో రుహుల్లా నిర్వహించిన సభకు ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన రాలేదని, కేవలం అభిమానులు మరియు బంధువులు మాత్రమే హాజరయ్యారని పరిశీలకులు అంటున్నారు. 

ఈ రాజకీయ సంక్షోభానికి చారిత్రక,  రాజ్యాంగపరమైన నేపథ్యం  ఉంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ-కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడిన సంగతి విదితమే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించగా, అక్టోబర్ 2024లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో  నేషనల్ కాన్ఫరెన్స్ కు 42 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా వారిలో ఎనిమిది మందికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. మిగిలిన 34 మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి పేరుకుపోవడం, దానికి తోడు అక్టోబర్ 27న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం ఈ తిరుగుబాటుకు ఆజ్యం పోసింది. 

ఇది కూడా చదవండి: కాశ్మీర్ వివాదాలు మరియు క్యాంపస్ రాజకీయాలు: జాతీయ స్థాయిలో పెరుగుతున్న వేడి.!

అసమ్మతి ఎమ్మెల్యేలు ఒకవైపు రాష్ట్ర హోదా కోసం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని,  కిచెన్ క్యాబినెట్  సంస్కృతికి స్వస్తి పలకాలని కోరుతూనే, మరోవైపు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.    ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలోని సంఖ్యాబలం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి కీలకంగా మారింది. కాంగ్రెస్, స్వతంత్రులు మరియు సీపీఎం మద్దతుతో ప్రభుత్వానికి సుమారు 50 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒకవేళ 25 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు అధికారికంగా మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం మైనారిటీలో పడే ప్రమాదం ఉంది. అయితే, ఇప్పటివరకు వారు కేవలం హెచ్చరికలకు గడువులకే పరిమితమయ్యారు తప్ప రాజీనామాలకు సిద్ధపడలేదు. ఈ పరిణామాలను ప్రతిపక్ష బీజేపీ నిశితంగా గమనిస్తోంది; త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని, పార్టీ ఉనికి కోల్పోతుందని బీజేపీ నేతలు అంటున్నారు. రామ్ మాధవ్ వంటి నేతలు రుహుల్లా ర్యాలీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి.    

భవిష్యత్తులో జమ్మూ-కాశ్మీర్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్‌సభ స్పీకర్ రుహుల్లా రాజీనామాను ఆమోదించిన తర్వాత  శ్రీనగర్ పార్లమెంటు స్థానం అధికారికంగా ఖాళీ అవుతుంది, ఆపై అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు, అసమ్మతి ఎమ్మెల్యేలు విధించిన 15 రోజుల గడువు ముగిసేలోపు ఒమర్ అబ్దుల్లా వారిని ఏ విధంగా బుజ్జగిస్తారనేది చూడాలి. పార్టీ అంతర్గత కలహాలను చక్కదిద్దుకుంటూనే, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హోదాను సాధించడం ముఖ్యమంత్రి ముందున్న అతిపెద్ద సవాలు.   జమ్మూ-కాశ్మీర్ ప్రజలు మాత్రం ఈ రాజకీయ నాటకాలకంటే తమ సమస్యల పరిష్కారాన్నే కోరుకుంటున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం అసలు అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటాయని, కేవలం మంత్రుల మార్పు వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదని  భావిస్తున్నారు. పదవుల కోసం జరిగే అంతర్గత పోరును పక్కన పెట్టి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై, రాష్ట్ర హోదా సాధనపై పాలకపక్షం దృష్టి సారించాలని కొరుతున్నారు. ఈ సంక్షోభం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ ఏ విధంగా బయటపడుతుందో, ఒమర్ అబ్దుల్లా నాయకత్వ పటిమకు ఇది ఎలాంటి పరీక్షగా నిలుస్తుందో రాబోయే రోజుల్లో తేలనుంది.   

మీకు నచ్చవచ్చు:  జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కాల్పులు..ముగ్గురు జవాన్లకు గాయాలు.!

జవాన్ సాహసం: భారీ ఉగ్ర దాడి భగ్నం.!

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Jammukashmir, Politicalcrisis, AgaRuhullah MehdiResignation, NationalConference, TeluguOne]