బీకామ్ ఫిజిక్స్ ఎమ్మెల్యే కూతురికి టీడీపీ టికెట్

 

బీకామ్ లో ఫిజిక్స్ ఉంది అంటూ వ్యాఖ్యానించి ఫేమస్ అయిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నారు. జలీల్ ఖాన్ తన కూతురిని రాజకీయ వారసురాలిగా దింపుతున్నారు. తాజాగా తండ్రి జలీల్‌ఖాన్‌తో పాటు షబానా ఖాతూర్‌ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంల టీడీపీ అభ్యర్థిగా తన కుమార్తె పేరును చంద్రబాబు ఖారారు చేసినట్లు తెలిపారు. పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్‌ఖాన్‌ అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాలేదని, తన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సీఎం చెప్పారన్నారు. వంగవీటి రాధా తెదేపాలో చేరనున్నారని, ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వనున్నారని పేర్కొన్నారు. తాము సమష్టిగా పని చేసి పార్టీని బలోపేతానికి కృషి చేస్తామని జలీల్‌ఖాన్‌ తెలిపారు. షబానా మాట్లాడుతూ...మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నానని తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్‌ వెల్లడించారు.