షర్మిల ఎంట్రీతో జగన్ ధైర్యం, స్థైర్యం జావగారిపోయాయా?

సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్  నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్  గూటికి చేరి ఆ పార్టీ  రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.  షర్మిల కాంగ్రెస్ లో చేరిక నిస్పందేహంగా జగన్ కు నష్టం చేకూరుస్తుందన్నవిషయంలో వైసీపీ నేతలకూ, శ్రేణులకూ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో  వైసీపీ విజయంలో షర్మిల అఅత్యంత కీలక పాత్ర పోషించారు.

అయితే జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీలో షర్మిలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా పొగబెట్టి మరీ పార్టీని వీడే పరిస్థితులను కల్పించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె రాష్ట్ర వీడి పొరుగురాష్ట్రంలో సొంత కుంపటి పెట్టుకుని రాజకీయాలు చేశారు. అయితే అక్కడా ఆమెను స్థిమితంగా ఉండనీయకపోవడం, ఆమె పార్టీకి ఎటువంటి సహాయసహకారాలూ అందకుండా అడ్డుకోవడంతో ఇప్పుడు ఆమె జగన్ కు వ్యతిరేకంగా ఏపీలోనే రాజకీయం మొదలు పెట్టారు.

వైఎస్ వారసత్వం కోసం అన్నతోనే పోటీ పడుతున్నారు. ఈ పోటీలో ఆమె జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య విషయంలో షర్మల జగన్ పై సంధిస్తున్న విమర్శనాస్త్రాలు వైసీపీకి సమాధానం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాయి. అలాగే ఆమె వైఎస్ వివేకా హత్య కేసులో  తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ8 అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా కడప లోక్ సభ బరిలో నిలవడంతో ఆ ప్రభావం మొత్తం జిల్లాపై కనిపిస్తోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా  జగన్ కు ఒకింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేశాయి. దీంతో జగన్ నైతిక స్థైర్యం దెబ్బతింది. ఆ కారణంగానే ఇంత వరకూ షర్మిలపై విమర్శలకు పార్టీ నేతలు, పార్టీ  సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం చేసి తాను సంయమనం పాటించిన జగన్.. పులివెందులపై షర్మిల ప్రభావం కనిపిస్తుండటంతో స్వయంగా తానే సొంత చెల్లిపై విమర్శలకు దిగారు. ఇది నిస్సందేహంగా ఆయన స్థైర్యం కోల్పోయారనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

చెల్లెలు కట్టుకున్న చీర రంగు  గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏ స్టేజికి చేరిందో తెలియజేశాయి. అలాగే కడపలో షర్మిలకు డిపాజిట్ కూడా రాదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు   చెల్లెలిపై అంత ప్రేమ ఉంటే అవినాష్ ను పోటీ నుంచి తప్పించొచ్చుకదా అంటూ ఆమె ఇచ్చిన రిటార్డ్ వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మొత్తం మీద అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ గెలుపు ఆశలను షర్మిల మరింత ఆవిరయ్యేలా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.