వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం

 

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీ.హెచ్.హనుమంతరావు, చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చేసుకొన్న జగన్ మోహన్ రెడ్డిని, ఇతర రాష్ట్రంలో జైలుకి తరలించాలని డిమాండ్ చేసినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమ నేతను పార్టీకి దూరంచేసి ఎన్నికల ముందు తమ పార్టీని దెబ్బతీయాలనే ఈ విధమయిన కుట్రలు పన్నుతోందని వారు ఆరోపించారు. ఆ రెండు పార్టీ నేతల మద్య యుద్ధం సంగతి ఎలా ఉన్నపటికీ, కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడయిన ఆయన ఏదో కాకతాళీయంగా ఆవిదంగా డిమాండ్ చేయలేదని తెర వెనుక నడుస్తున్న కధ చూస్తే అర్ధం అవుతుంది.

 

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆర్ధిక లావాదేవీలపై సీబీఐకి సమాంతరంగా దర్యాప్తు చేస్తున్న ఈ.డీ. అధికారులు జగన్ మోహన్ రెడ్డిని కొన్ని నెలల క్రితమే చంచల్ గూడా జైలులో విచారించారు. కానీ ఆయన వారికి సహకరించకపోవడంతో, ఆయనని విచారించేందుకు తమకి అనువుగా ఉండే తీహార్ జైలుకి బదిలీ చేయాలని కోరుతూ వారు తమపై అధికారులకు ఏప్రిల్ నెలలో ఒక లేఖ వ్రాశారు. దానికి వారి నుండి ఇంకా జవాబు రాలేదు. ఈనెలాకరులోగా కానీ లేదా వచ్చే నెల రెండవ వారంలోగా గానీ తమకి అనుమతి దొరకవచ్చునని వారు భావిస్తున్నారు.

 

అదే జరిగితే జగన్ మోహన్ రెడ్డిని వచ్చేనెలలో తీహార్ జైలుకి తరలించే అవకాశాలున్నాయి. ఈలోగా ఈ.డీ. అధికారులు విదేశాలలో వివిధ బ్యాంకులు, సంస్థల నుండి జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వివిధ కంపెనీలలోకి వచ్చిపడిన ‘నిధుల వరదల’ వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ, జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కేసుల్లోంచి బెయిలుపై బయటపడితే, ఆయనని విదేశాల నుండి చట్టవిరుద్ధంగా పెట్టుబడులు రప్పించుకొన్న కేసులలో బిగించేందుకు ఈ.డీ. అధికారులు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఇప్పటికే, వారు జగన్ మోహన్ రెడ్డి మరియు అతనికి సంబంధించిన వివిధ కంపెనీలకు చెందిన రూ.122కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేసారు.

 

ఇక, తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి ఈసారి తప్పకుండా బెయిలు మీద విడుదల అవుతాడని గంపెడు ఆశలు పెట్టుకొన్న ఆ పార్టీనేతలు సుప్రీంకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. పైగా సుప్రీంకోర్టు ఆయనకి బెయిలు నిరాకరిస్తూ దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక నేరాల గురించి వ్యక్తం చేసిన అభిప్రాయలు వారిని మరింత కలవరపరిచాయి. కానీ, మరో నాలుగు నెలల తరువాత అయినా బెయిలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్న వారందరికీ, రేపు ఈ.డీ.అధికారులు జగన్ మోహన్ రెడ్డిని తీహార్ జైలుకి తరలించి కొత్త కేసులు మొదలుపెడితే ఇక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

 

సీబీఐ నుండి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిలలో ఆయన న్యాయ వాదులు చేస్తున్న న్యాయ పోరాటం సత్ఫలితాలు ఇవ్వకపోగా, ఆయనపట్ల కోర్టులకున్న అభిప్రాయలు వివిద రూపాలలో నిత్యం ప్రకటితమవుతునే ఉన్నాయి. అయినప్పటికీ, కోర్టులను తప్పుపట్టలేని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు, ఆయా తీర్పులలోంచి తమకు అనుకూలమయిన అంశాలున్నాయంటూ తమను తాము మభ్యపెట్టుకొంటూ, "త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి బయటకి వస్తాడు! రాజన్న రాజ్యం తెస్తాడు! అంటూ ప్రజలను కూడా మభ్యపెడుతున్నారు.

 

తమ నాయకుడు జైలు నుండి విడుదల కావాలంటే ఏమిచేయాలో కొందరు కాంగ్రెస్ నేతలే స్పష్టంగా చెపుతున్నారు. వారి సూచనలు పాటించి ఆయన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయి, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదు.

 

అయితే, ఈ మద్యనే ఆయనను జైల్లో కలిసి వచ్చిన దాడి వీరభద్ర రావు మాటల ప్రకారం ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీకి లొంగబోడని అర్ధం అవుతోంది. “ఇంత కాలం జైల్లో పెట్టి తనను వేధించిన కాంగ్రెస్ పార్టీ ఇంత కంటే ఏమి చేయలేదు గనుక ఆ పార్టీతో చేతులు కలిపే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేసినట్లు దాడి మాటల ద్వారా అర్ధం అవుతోంది.

 

దీనిని బట్టి అర్ధం అవుతున్నదేమిటంటే ఇటు జగన్ మోహన్ రెడ్డి కానీ, అటు కాంగ్రెస్ గానీ రెండూ వెనక్కి తగ్గే ఆలోచనలో లేవు గనుక, కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న ‘చిలకలకు’ జగన్ మోహన్ రెడ్డి కేసుల విషయంలో తగిన కార్యాచరణ నిర్దేశించవచ్చును. అప్పుడు ఆయన మరిన్నినెలలు లేదా ఏళ్ళు జైలుకే అంకిత మయిపోవలసి రావచ్చును. ఇది ఆయన పార్టీపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మార్చే అవకాశం ఉంది.

 

కానీ, ఇంతవరకు ఆయన ధృడంగానే మాట్లడుతున్నపటికీ తనను చంచల్ గూడా జైలు నుండి డిల్లీకి తరలించేందుకు నిశ్చయమయితే, అప్పుడు ఆయన విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో రాజీచేసుకోవచ్చును. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పంతానికి పోయి తన వ్యక్తిగత, రాజకీయ జీవితాన్నిచేజేతులా నాశనం చేసుకొనే కంటే ఆ పార్టీతో రాజీపడి, ఈ కేసుల నుండి బయటపడి ప్రభుత్వంలో చేరగలిగితే, క్రమంగా కాంగ్రెస్ పార్టీనే ఆయన తన చెప్పుచేతలలోకి తెచ్చుకోవచ్చును. బహుశః త్వరలోనే ఈ చిక్కు ముడులన్నీ విడిపోయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం తేలిపోవచ్చును.