ఇలా కూడా పాదయాత్ర చేస్తారా..?

 

జగన్ పాదయాత్ర విషయంలో ఇప్పటికీ వైసీపీ నేతలు అందోళన చెందుతూనే ఉన్నారు. మొదటి నుండి జగన్ పాదయాత్రపై అనుమానాలే ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ వారానికి ఒకసారి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపధ్యంలో జగన్ పాదయాత్రకు ఇది ఆటంకం కలుగుతుందని భావించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను పాదయాత్ర చేయాలనుకుంటున్నానని.. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇక పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యవహారం సీబీఐ కోర్టులోనే తెల్చుకోవాలని చెప్పింది. దీంతో జగన్ మళ్లీ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అక్కడ కూడా జగన్  కు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కోర్టు జగన్ పిటిషన్ ను తిరస్కరించింది.

 

ఇక హైకోర్టు ఎప్పుడైతే సీబీఐ కోర్టులో తేల్చుకోమని చెప్పిందే..అప్పుడే వైసీపీ నేతలకు పరిస్థితి దాదాపు అర్ధమైంది. అందుకే నవంబర్‌ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆతరువాత నవంబర్ మూడో వారం నుండి అన్నారు. ఇక ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పుతో షాక్ కు గురైన వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ పాదయాత్ర విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. వారంలో ఒకరోజు పాదయాత్రకు బ్రేక్‌ ఇవ్వడం తప్పనిసరి. అయితే ఆ బ్రేక్‌ ఎలా ఇవ్వాలి? అని పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించారట. వారానికోసారి హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కి చేరుకుని, న్యాయస్థానం యెదుట హాజరై, తిరిగి పాదయాత్ర చేసే ప్రాంతానికి వెళ్ళాలనే ప్రతిపాదన ఒకటి ఆయన ముందుకు వచ్చిందట. ఇది తప్ప వైఎస్‌ జగన్‌కి ఇంకో బెస్ట్‌ ఆప్షన్‌ కనిపించడంలేదు. ఎంత దూరంలో ఉన్నా హెలికాప్టర్‌లో ప్రయాణమంటే కేవలం రెండు మూడు గంటలు సరిపోతుంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్న కూడా తలెత్తిందట. దానిపై పార్టీ ముఖ్య నేతలెవరూ మాట్లాడలేని పరిస్థితి నెలకొందట. ఎటు చూసినా దారి దొరక్కపోవడం, రాజకీయంగా పూర్తి గందరగోళంలో పడిపోవడంతో వైఎస్‌ జగన్‌ పాదయాత్రపైనా అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో అసలు పాదయాత్ర జరుగుతుందో..? లేదో..? కూడా డౌట్ కొడుతుంది. పాపం జగన్.. ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను పాదయాత్ర చేసి అయినా కాస్త మంచి పేరు తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది కూడా కలిసిరావడం లేదు.. చూద్దాం ఆఖరికి ఏం జరుగుతుందో..!