ట్విట్టర్ లో 'ఫణి తుఫాను' సృష్టించిన ఐవైఆర్

 

మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఐవైఆర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఆయన విమర్శలు ఎదుర్కొనేలా కూడా చేస్తోంది. ఫణి తుఫాను ప్రభావం ఏపీ మీద ఉండొచ్చని వార్తలొస్తున్న నేపథ్యంలో.. “దూసుకొస్తున్న ఫణి తుఫాను తమిళనాడు కు పోతుందని ఆశిద్దాం. పొరపాటున ఆంధ్ర తీరాన్ని తాకింది అంటే ఇక ముఖ్య కార్యదర్శి లక్ష్యంగా విపత్తుల నిపుణుడు తన అనుకూల మీడియా సహాయంతో చేసే హంగామా అంతా ఇంతా ఉండదు." అంటూ చంద్రబాబుని పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.

అయితే ఆయన ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన తీరుని తప్పుబడుతున్నారు. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయ్యుండి.. విపత్తు వంటి అంశాల మీద కూడా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు. తుఫానును కూడా రాజకీయం చేసేశారు సరే.. మరి మధ్యలో తమిళనాడు మీద అక్కసు ఎందుకు? కనీసం తీరం తాకే లోపే బలహీనపడాలని కోరుకునే సంస్కారం కూడా లేకపోయిందా?  అని నిలదీస్తున్నారు. కొందరైతే.. అవును "చంద్రబాబు విపత్తుల నిపుణుడే. విపత్తుల సమయంలో చంద్రబాబు ఏం చేశారో ఏం చేయ్యగలరో కొత్తగా ఈయన సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రజలకు బాగా తెలుసు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.