తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌!.. కేసీఆర్ క‌న్నెర్ర‌!

త‌మిళిసై. ప్ర‌స్తుత తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌. అంత‌కుముందు త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ టాప్ లీడ‌ర్‌. అప్ప‌ట్లో బీజేపీ మౌత్‌పీస్‌. ఇప్పుడు కేంద్రానికి. కేంద్రం అంటే.. ప‌రోక్షంగా బీజేపీనేగా!. అందుకే, త‌ట‌స్థంగా ఉండాల్సిన‌ గ‌వ‌ర్న‌ర్ కాస్తా.. స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఆమె వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ రాజ్‌భ‌వ‌న్‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఒక‌ప్పుడు అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య ఆత్మీయ బంధం ఉండేది. రెండు భ‌వ‌న్‌ల మ‌ధ్య దూరం చాలా చాలా త‌క్కువ‌గా ఉండేది. కానీ, త‌మిళిసై వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ దూరం బాగా పెరిగిపోయింది. గ‌వ‌ర్న‌ర్‌ను ముఖ్య‌మంత్రి క‌లిసే సంద‌ర్భాలు చాలా అరుదుగా మారాయి. త‌మిళిసై.. బీజేపీ గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావ‌న‌లో ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఉంది. 

ఇక గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. కేవ‌లం ర‌బ్బ‌ర్ స్టాంప్‌లా మాత్ర‌మే ఉండ‌కుండా కొత్త త‌ర‌హాలో స్వ‌తంత్రంగా పనిచేసుకుపోతున్నారు. అదే కేసీఆర్‌కు కంటిగింపుగా మారిందని చెబుతున్నారు. తాజాగా, గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న ఓ నిర్ణ‌యం మ‌రింత దూరం పెంచ‌నుంద‌ని అంటున్నారు. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు పేద, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ పిల్ల‌ల‌కు దూరం కాకుండా ఉండేలా వారికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ భావించారు. అందుకోసం.. ఐటీ, కార్పొరేట్ కంపెనీలు వాళ్లు వాడ‌ని ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల‌ను విరాళంగా ఇవ్వాల‌ని పిలుపు ఇచ్చారు. అవి కావాల్సిన పేద విద్యార్థులు రాజ్‌భ‌వ‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటూ ఫోన్ నెంబ‌ర్‌, ఈ-మెయిల్ ఇచ్చి ఆద‌ర్శంగా నిలిచారు. గ‌వ‌ర్న‌ర్ చేస్తున్న‌ది మంచి ప‌నే. అంతా అభినందించాల్సిన విష‌య‌మే. కానీ, ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నిని.. రాజ్‌భ‌వ‌న్ చేస్తుండ‌ట‌మే.. రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారిందంటున్నారు. 

గ‌తంలోనూ ప‌లుమార్లు కేసీఆర్‌ ప్ర‌భుత్వ విధానాల‌ను త‌ప్పుబ‌ట్టారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. అప్ప‌ట్లో స‌ర్కారు పెద్ద సంఖ్య‌లో కొవిడ్ టెస్టులు చేయ‌క‌పోవ‌డాన్ని ప్ర‌శ్నించారు. యూనివ‌ర్సిటీల‌ వైస్ ఛాన్స‌ల‌ర్ల నియామ‌కం ఆల‌స్యంపైనా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్ర‌జా ద‌ర్బార్ పేరుతో రాజ్‌భ‌వ‌న్‌కు సామాన్యుల‌ను ఆహ్వానిస్తూ.. వారి నుంచి స‌మ‌స్య‌ల‌పై విజ్ఞ‌ప్తులు స్వీక‌రిస్తున్నారు. ఇలా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. స‌మాంత‌ర పాల‌న న‌డిపిస్తున్నారంటూ ప్ర‌భుత్వం గుర్రుగా ఉంది. ఇక ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్ స‌ర్కారుపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేయ‌డం.. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫైలును గ‌వ‌ర్న‌ర్ హోల్డ్‌లో పెట్ట‌డం.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు రాజ్‌భ‌వ‌న్‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే విష‌యం స్ప‌ష్టం చేస్తోంది. అందుకే, గ‌వ‌ర్న‌ర్‌ను నేరుగా క‌లిసే ఉద్దేశ్యం లేక‌నే.. సీఎం కేసీఆర్ ఇటీవ‌ల గాంధీజ‌యంతి రోజున బాపూఘాట్‌కు కూడా వెళ్ల‌లేద‌ని అంటారు. ఇక‌, తాజాగా పేద విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ పిలుపివ్వ‌డం.. రెండు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుగానే అభివ‌ర్ణిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.