వికేంద్రీకరణ అంటే పంచాయతీ నిధులను దారి మళ్లించడమేనా?

నోటితో వికేంద్రీకరణ అంటూ చేతల్లో అధికారాలన్నీ గంపగుత్తగా అధీనంలో ఉంచుకుంటున్నది జగన్ సర్కార్. స్థానిక సంస్థల నిధులు, విధులను హరించేసి.. పంచాయతీలను నిర్వీర్యం చేయడం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిథులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తోందని తెలుగుదేశం ధ్వజమెత్తింది.

అమరావతిని నిర్వీర్యం చేయడానికే వికేంద్రీకరణ పాట పాడుతోంది కానీ వాస్తవానికి జగన్ సర్కార్ తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శిస్తున్నది.  కేంద్రం రాష్ట్రంలోని పంచాయతీలకు పంపిన 14, 15 ఆర్థిక సంఘం నిధులను రహస్యంగా దొడ్డిదారిన మళ్లించి, నిలదీస్తే కరెంటు బిల్లులు కట్టామంటూ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని నిలదీస్తోంది. తెలుగుదేశం నాయకుడు బూబా రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ ల సమావేశంలో మాట్లాడుతూ..ఆర్ధిక సంఘం నిధులను దొడ్డిదారిన డ్రా చేసి,  నిజంగానే విద్యుత్ బిల్లులు కట్టి ఉంటే ఆ రసీదులను సర్పంచ్ లకు పంపాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిగా అప్పులు చేయడం, నిధులను దారి మళ్లించడం, ఏ పని చేయాలన్నా సొమ్ములు లేవంటూ బీద అరుపులు అరవడం ఈ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయిందని రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు.

  పంచాయతీల నిధులను దారి మళ్లించి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు కట్టామన్న మాట శుద్ధ అబద్ధమనీ, ఇప్పటికీ బకాయిల కోసం విద్యుత్ అధికారులు సర్పంచ్ లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ప్రభుత్వం చరిత్రలో వైసీపీ ఒక్కటేననీ, బుకాయింపులు వినా ఈ మూడేళ్ల కాలంలో జగన్ సర్కార్ రాష్ట్రం కోసం చేసినదేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు.  సర్పంచుల సంతకాలు లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు దొడ్డిదారిన దారి మళ్ళించడం నిబంధనల ఉల్లంఘనేనని ఆయన అన్నారు.  

అసలు  గ్రామపంచాయితీలలో నిధులు సర్పంచ్ సంతకం లేకుండా మీరు ఎలా డ్రా చేశారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిథులకు కేంద్రం మీకు సమాచారం లేకుండా దొడ్డిదారిన డ్రా చేస్తే మీరు అంగీకరిస్తారా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అంతే కదా? మరి సర్పంచ్ ల సంతకం లేకుండా, సర్పంచ్ కు సమాచారం లేకుండా నిధులు ఎలా డ్రా చేశారో వివరణ ఇవ్వాలని రాజేంద్ర ప్రసాద్ నిలదీశారు.

గత ముఖ్యమంత్రులు మైనర్ పంచాయతీలకు విద్యుత్ ఉచితంగా ఇచ్చిన సంగతి మీకు తెలుసా ఆర్థిక మంత్రిగారూ అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.    ఆర్థిక సంఘం నిధులు రూ. 7660 కోట్ల ను వెంటనే   గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.