మహిళల క్రికెట్ లో మన్కడింగ్ వివాదం!

ఐసీసీ ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా క్రికెట్ లో మన్కడింగ్ వ్యవహారం మాత్రం వివాదాస్పదంగానే ఉంటోంది. మన్కడింగ్ అంటే బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటి బయటకు వెళితే బౌలర్ బాల్ డెలివరీ చేయడానికి ముందే స్టంప్ చేసి రనౌట్ చేయడం.

ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని క్రీడా పండితులు, ఆటగాళ్లు అంటుంటారు. కానీ నిబంధనల మేరకు బౌలర్ బంతి విసరడానికి ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటడానికి వీల్లేదు. అలా దాటితే బౌలర్ స్టంప్ చేసి ఔట్ చేయవచ్చు. అయితే ఇది బౌలర్ నైపుణ్యానికీ, బ్యాటర్ వైఫల్యానికీ సంబంధించిన ఔట్ కాదు కనుక ఇలా ఒక బ్యాటర్ ను ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అంటుంటారు. నిబంధనల మేరకు ఇది సరైనదే అయినా, ఇలాంటి ఔట్ చేసిన బౌలర్ పై విమర్శలు వెల్లువెత్తడం సాధారణమైపోయింది.

ఇంతకీ ఈ తరహా రనౌట్ ను మన్కడింగ్ అని ఎందుకంటారంటే.. 1947-48లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ బిల్ బ్రౌన్ ను భారత్ బౌలర్ వినూమన్కడ్ ఈ రీతిలోనే ఔట్ చేశాడు. క్రికెట్ చరిత్రలో ఈ తరహాలో ఒక బ్యాటర్ రనౌట్ కావడం ఇదే మొదటి సారి. దీంతో ఈ తరహా రనౌట్ ను మన్కడింగ్ అంటారు. తాజాగా ఈ మన్కడింగ్ మహిళల క్రికట్ లో నూ వివాదాన్ని రేపింది.

ఇంగ్లండ్ తో చివరి వన్డే సందర్భంగా భారత్ బౌలర్ దీప్తి శర్మ ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ ను మన్కడింగ్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దీప్తి శర్మ వ్యవహరించారని నిందలేస్తున్నారు. వాస్తవానికి ఈ తరహాలో ప్రత్యర్థి బ్యాటర్ ను ఔట్ చేయడంలో అనుచితమేమీ లేదనీ క్రికెట్ నిబంధనలు విస్పష్టంగా చెబుతున్నాయి. పైగా క్రికెట్ జంటిల్ మెన్ గేమ్ నుంచి ప్రొఫెషనల్ గేమ్ గా మారిపోయిన తరువాత ప్రతి పరుగూ, ప్రతి బంతీ, ప్రతి వికెట్ జట్లకు అత్యంత ప్రాధాన్యమైపోయాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ తెరపైకి స్లెడ్జింగ్ వచ్చింది. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను చెడగొట్టడానికి నోటికి పని చెప్పడం సర్వసాధారణమైపోయింది. ఈ స్లెడ్జంగ్ లో ఆస్ట్రేలియా, ఆ తరువాత ఇంగ్లాండ్ సిద్ధ హస్తుల్లా పేరొందాయి. స్లెడ్జింగ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కానప్పుడు.. నిబంధనల ప్రకారం తప్పుకాని మన్కడింగ్ విషయంలోనే క్రీడాస్ఫూర్తి అంశాన్ని ఎందుకు బయటకు తీసుకువస్తారన్నది అర్ధం కాని విషయం.

ఎందుకంటే.. ప్రతి పరుగూ విజయాన్ని నిర్దేశించేటంత పోటీ తత్వంతో జరుగుతున్న మ్యాచ్ లో బౌలర్ బంతి వేయడానికి ముందే క్రీజ్ దాటి వెళ్లి వేగంగా ఎక్సట్రా రన్ సాధించేందుకు ప్రయత్నించడం ఎందుకు క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదో మన్కడింగ్ ను విమర్శించే వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మన్కడింగ్ ఎంత మాత్రం వివాదం కాదని ఐసీసీ విస్పష్ట వివరణ ఇచ్చిన తరువాత కూడా వివాదాన్ని కొనసాగించడం అర్ధరహితమని క్రీడా పండితులు అంటున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దీప్తి శర్మ చార్లీ డీన్ ను మన్కడింగ్ చేయడంపై నిప్పులు చెరుగుతున్న ఇంగ్లాండ్..ఇదే సిరీస్ లో  ఇంగ్లాండ్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎమీ  జోన్స్‌.. స్మృతి మంధాన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి గ్రౌండ్ కు తాకినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా స్ట్రాంగ్ అప్పీల్ కేసింది.

స్మృతి మంథాన  ఔట్‌ అయ్యానని డిసైడ్ అయి పెవిలియన్ వైపు కదిలినా ఏమీ జోన్స్ తాను క్యాచ్ డ్రాప్ చేసిన విషయం చెప్పి ఆమెను వెనక్కు పిలవలేదు.  అయితే రీప్లేలో విషయం బయటపడటంతో అంపైర్లు స్మృతిని వెనక్కు పిలిచారు అది వేరే సంగతి. మరి క్యాచ్ డ్రాప్ చేసినా అప్పీల్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదా? అన్న ప్రశ్నకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జవాబు చెప్పాలి. తాము చేస్తే రైట్..ప్రత్యర్థులు చేస్తే రాంగ్ అనే తీరే   క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని తెలుసుకోవాలి.