భూగర్భ క్షిపణి నగరం వీడియోతో అమెరికాకు ఇరాన్ హెచ్చరిక: ఉద్రిక్తతలు మరింత పెరిగే చాన్స్.!
Published on: Mon Nov 23, 2026 4:47PM

అమెరికాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సైన్యం తాజాగా విడుదల చేసిన వీడియో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఆ దృశ్యాలలో ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించగల కొత్త లాంచర్‌ను ఇరాన్ సైన్యం ప్రదర్శించింది. ద్రవ ఇంధనంతో పనిచేసే ఈ లాంచర్ వ్యవస్థను ఇరాన్ దళాలు బహిరంగంగా చూపించడం ఇదే తొలిసారి.
వీడియోలో భూగర్భ క్షిపణి నగరానికి సంబంధించిన సొరంగ మార్గాలు, అందులోని ఆయుధ నిల్వల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ కమాండర్లు ఒక వాహనంపై సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ అక్కడి వ్యవస్థలను పరిశీలిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. వాటిలో యాంటీ షిప్ క్షిపణులు, సముద్ర మందుపాతరలు కూడా ఉన్నాయి. అలాగే ఇరాన్ విడుదల చేసిన వేరొక వీడియోలో మరికొన్ని ఆయుధాలను ప్రదర్శించింది. గతంలోనూ ఇటువంటి భూగర్భ క్షిపణి నగరాల దృశ్యాలను ఇరాన్ కొన్నిసార్లు ప్రపంచం ముందు ఉంచింది.
ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఆ దేశ అణు, క్షిపణి వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వీడియో విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ఆయుధ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన అమెరికాకు, దాని మిత్రదేశాలకు ఈ వీడియో ద్వారా ఇరాన్ స్పష్టమైన హెచ్చరిక జారిచేసిందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ ఆయుధాలు భూగర్భంలో లోతుగా ఉన్నందున వాటిని పూర్తిగా నాశనం చేయడం అంత సులభం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నుంచి ఎదురయ్యే దాడులను అడ్డుకోవడం అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: వియత్నాం కంటే ఇరాన్ యుద్ధమే అమెరికాకు పెద్ద పరాజయం?
ఇరుపక్షాల ప్రకటనలు, సైనిక సంసిద్ధత చర్యలతో పశ్చిమాసియాలో పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. గల్ఫ్ ప్రాంత భద్రత, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళన ప్రపంచ దేశాలలో వ్యక్తమౌతోంది.

ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాంతీయ స్థిరత్వం కోసం అంతర్జాతీయ సమాజం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. ఇరువైపుల నుంచి వచ్చే తదుపరి ప్రకటనలు, భద్రతాపరమైన అడుగులు పరిస్థితిని ఏ దిశగా తీసుకెళ్తాయో వేచి చూడాల్సి ఉంది.
మీకు నచ్చవచ్చు: అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం.. కథ, కమామిషు!
అమెరికా-ఇరాన్ సంక్షోభం.. సైనిక ఒత్తిడులు .. వ్యూహాత్మక సవాళ్లు.!
[Iran Missile City, Iran dual launcher,America Iran tensions, IRGC missiles, TeluguOne]


