ఐపిఎల్ 2016 హిట్టా..ఫట్టా..?
posted on Apr 29, 2016 5:41PM
ఇండియాకు జాతీయ క్రీడ అఫీషియల్ గా హాకీయే అయినా, అనఫీషియల్ గా మాత్రం క్రికెట్టే ఈ దేశపు జాతీయక్రీడ. క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్లు భారత్ లో కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అందుకే భారత క్రికెట్ బోర్డ్ ఐపిఎల్ ను స్టార్ట్ చేసి, ప్రతీ ఏడాది కోటానుకోట్ల రూపాయలు దండుకుంటోంది. 2008లో మొదలైన ఐపిఎల్, ఎన్ని అడ్డంకులెదురైనా, సక్సెస్ ఫుల్ గానే నడుస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం, ఐపిఎల్ డల్ అయిపోయింది. చూసి చూసి జనాలకు బోర్ కొట్టేసిందా, లేక వన్ సైడెడ్ గా సాగిపోతున్న మ్యాచ్ లు ఆసక్తిని కలిగించట్లేదా..? ఏమో...కారణాలు సవాలక్ష ఉండచ్చు. కానీ ఐపిఎల్ కు ఆదరణ తగ్గిందన్నది మాత్రం వాస్తవం. ఐపిఎల్ సీజన్లో రోడ్డు మీద వెళ్తుంటే, ఎటు చూసినా టీవీల్లో మ్యాచ్ లే కనబడేవి. కానీ ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి..జనాలందరూ తాపీగా సీరియల్స్ చూస్తున్నారు. మ్యాచ్ ల మీద ఎవరికీ ఆసక్తి కనబడట్లేదు. కాలేజీల్లో డిస్కషన్లు లేవు. క్యాంటీన్లో మా టీం గొప్పదంటే మా టీం గొప్పదని అనుకోవడాలు లేవు. ఆదరణ తగ్గిందన్న వాస్తవం ఇప్పటికిప్పుడు స్పష్టంగా తెలియకపోయినా, టోర్నీ ముగిసిన కొద్ది రోజులకు తేటతెల్లమవుతుంది.
లీగ్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న టీం లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. ఇక, క్రేజ్ లేకపోయినా మంచి టీం అని రాజస్థాన్ రాయల్స్ కు పేరు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా, ఈ రెండు టీమ్ లూ ఏడాదికాలం పాటు సస్పెండ్ అయ్యాయి. లీగ్ కున్న ఆదరణ కూడా వీటితో పాటే మసకబారింది. గుజరాత్, పుణే అని రెండు కొత్త టీమ్ లు వాటి స్థానంలో వచ్చాయి. ఈ రెండూ ఎంత కాలం ఉంటాయో తెలీదు. సస్పెన్షన్ కాలం ముగిసిన తర్వాత చెన్నై, రాజస్థాన్ ఆటగాళ్లు తమ తమ టీమ్స్ లోకి వెళ్లిపోతారా..? లేక మళ్లీ వేలం ఉంటుందా..? అభిమానులకు ఇలాంటి ఎన్నో సందేహాలు.
చిన్న పిల్లల ఆటలా, ప్రతీ ఏడాది ఒక టీం నుంచి మరో టీం కు ఆటగాళ్లను మార్చడం కూడా లీగ్ పై విశ్వసనీయత లేకుండా చేస్తుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లాంటి ఫుట్ బాల్ లీగ్ సక్సెస్ అవడానికి కారణం అభిమానులు ఆ టీమ్ లను తమవిగా భావిస్తారు. టీమ్స్ కూడా వీలైనంత వరకూ అదే సభ్యులను మెయింటెయిన్ చేస్తాయి. కానీ ఐపిఎల్ లో మాత్రం, ఈ ఏడాది ఒక టీంలో ఆడిన ఆటగాడు వచ్చే ఏడాది ప్రత్యర్ధి టీంలో ఆడతాడు. దీని వల్ల, ఏ టీమ్ ను, ఏ ఆటగాడిని మాది అని చెప్పుకోవడానికి అభిమానులకు ఛాన్స్ ఉండదు. ఐపిఎల్ కు ఆదరణ ఎంతలా తగ్గిపోయిందో మ్యాచ్ లు జరిగేప్పుడు స్టేడియాన్ని చూస్తే అర్ధమవుతుంది. స్టేడియాలన్నీ సగానికి పైగా ఖాళీగానే ఉంటున్నాయి. ఒక్క బెంగళూరు మాత్రమే కాస్త నిండుగా కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది మరో సమస్య, మ్యాచ్ ల తరలింపు గందరగోళం. మహారాష్ట్రలోని నీటి కరువు కారణంగా, ఆ రాష్ట్రానికి సంబంధించిన ముంబై, పుణే టీమ్ లు ఎక్కడ ఆడతాయో అన్న ఆదుర్దా అభిమానులను గందరగోళంలో పడేసింది.
ఇప్పటి వరకూ పోటాపోటీగా, కుర్చీ అంచున కూర్చోపెట్టే మ్యాచ్ ఒక్కటీ జరగలేదు. అద్భుతాలేమీ నమోదు కాలేదు. లీగ్ చాలా సాదాసీదాగా సాగిపోతోంది. టాస్ గెలిచిన టీం, మ్యాచ్ కూడా గెలుస్తోంది. ఛేజింగ్ చేస్తే ఈజీగా గెలుస్తున్నారు. ఇక మ్యాచ్ లో ఆసక్తి ఎక్కడ ఉంటుంది. ఐపిఎల్ సీజన్లో సినిమాలు రిలీజ్ చేద్దామంటే, ఎఫెక్ట్ ఉంటుందేమోనని గతేడాది వరకూ భయపడేవారు. ఇప్పుడు ఐపిఎల్ కారణంగా సినిమాలు భయపడే పరిస్థితి అసలే లేదు. సమ్మర్లోనే రిలీజైన జంగిల్ బుక్, సరైనోడు లాంటి సినిమాలు ఎలాంటి అడ్డూ లేకుండా హాయిగా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంటున్నాయి.
అతి సర్వత్ర వర్జయేత్ అని ఒక నానుడి. ఎక్కువైతే తీపి కూడా చేదెక్కుతుంది. భారతీయులం ఎంత క్రికెట్ పిచ్చోళ్లం అయినా, అదే పనిగా వీటిని చూడటం బోర్ కొడితే తప్పు లేదు మరి. చూద్దాం. లీగ్ రెండో ఫేజ్ నుంచి అయినా, ఆసక్తిగా మారుతుందేమో..