15 రోజుల్లోనే లక్ష కరోనా కేసులు.. అమెరికాని దాటే దిశగా భారత్ పరుగులు!

రెండు నెలల క్రితం కరోనా దెబ్బకి.. బ్రతికుంటే గంజో గింజో తాగి బ్రతకొచ్చు. పైసలకంటే ప్రాణాలు ముఖ్యం అనుకున్నారంతా. కానీ ఇప్పుడు, ఎవరి బ్రతుకు వాళ్ళది, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. ఆర్ధిక వ్యవస్థ కుదేలవకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. కానీ కరోనా వైరస్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉంది. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా కంటపడిన అందరికీ సోకుతా అంటుంది. ఇటీవల ఇంకా విశ్వరూపం చూపిస్తోంది. లాక్ డౌన్ లో సడలింపులు పెరిగే కొద్దీ విజృంభిస్తోంది. ఎంతలా అంటే, ఇప్పటివరకు భారత్ లో నమోదైన కరోనా కేసులు రెండు లక్షలైతే.. అందులో లక్ష కేసులు గత రెండు వారాల్లోనే నమోదయ్యాయి.

ప్రస్తుతం భారత్ లో రోజుకి 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8,909 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 207,615 కి చేరుకుంది. దేశ మొత్తం జనాభాతో పోల్చుకుంటే.. రెండు లక్షల కేసులంటే చాలా తక్కువ శాతం కేసులే. కానీ ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, తక్కువ రోజుల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండటమే. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిందంటే, వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వచ్చే నెల రోజుల్లో పది లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని, రెండు మూడు నెలల్లో అమెరికాను దాటేసినా ఆశ్చర్యం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు దేశ ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ప్రజల ఆరోగ్యం పట్ల కూడా మరింత శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు.