నేరమే అధికారమై ప్రజల్ని వెంటాడుతోంది.. ఐఏఎస్ ట్వీట్ కలకలం
posted on Mar 8, 2021 7:10AM
అవును నేరమే అధికారమై ప్రజల్ని వెంటాడుతోంది.. ఈ మాటలంది ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాజీ అదనపు కార్యదర్శి పి.వి.రమేష్. ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. పీవీ రమేష్ ట్వీట్ పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవర్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారన్నది అందరికి ఈజీగానే అర్ధమవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఉద్దేశించే పీవీ రమేష్ ఈ ట్వీట్ చేశారనే చర్చ జరుగుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ తాజాగా ఓ ట్వీట్ తీవ్ర సంచలనం రేకెత్తించింది. “నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే.. ఊరక కూర్చున్న, నోరున్న ప్రతివాడు నేరస్తుడే!- వరవరరావు” అన్న కోట్‌ను పి.వి.రమేష్ ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ‘జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన కోటరీ నుంచి వెళ్లిపోయిన ఒక మాజీ అధికారి గారు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు’’ అంటూ చర్చ నడుస్తోంది. దీనిమీద మాకు స్పష్టత కావాలంటూ అందరూ రమేష్‌ను కోరుతున్నారు కానీ ఆయన్నుంచి స్పందన రాలేదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టారని కొందరు గట్టిగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. చాలా స్పష్టంగా ఆ ట్వీట్ అర్థమవుతోందంటున్నారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం కావడంతో ట్వీట్ పెట్టి 7 గంటల తర్వాత పి.వి.రమేష్ వివరణ ఇచ్చారు. తాను ఏ ఒక్క వ్యక్తిని లేదా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వరవరరావు మాటలను ఉటంకించలేదని తేల్చిచెప్పారు. విశ్వజనీనమైన, కాలాతీతమైన సత్యాలను వ్యక్తిగతంగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తే.. మీ ఆలోచనా శక్తి అంతవరకే పరిమితమైనదిగా భావించవచ్చని ట్రోలింగ్ చేసేవారికి చురకలంటించారు.
ఏపీ ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి పీవీ రమేష్ ఇటీవలే తప్పుకున్నారు. 35 ఏళ్ల పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత ఆయనకు అదనపు ప్రధాన కార్యదర్శిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే రమేష్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. జగన్ కోటరీలో తనకు విలువ లేకపోవడంతోనే పీవీ రమేష్ తప్పుకున్నారనే గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ తో అది నిజమేనని అర్ధమవుతోంది.