వివక్ష: హిందువుని సొంత ప్లేటు..గ్లాసు తెచ్చుకోమన్న ముస్లింలు

పాకిస్థాన్‌లో మతపరమైన వివక్ష ఎంతగా కొనసాగుతోందో తెలిపే ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా హిందూ మతానికి చెందిన ఓ పత్రికా విలేకరి పట్ల సహచర ఉద్యోగులే వివక్ష చూపించారు. ఎన్నాళ్లుగానో తమతో పాటే కలిసి పనిచేస్తున్న వ్యక్తి, హిందువని తెలియడంతో అతడిని తమతో కలిసి భోజనం చేయడానికి వీల్లేదంటూ దూరం పెట్టారు. అంతటితో ఆగకుండా ఇకపై తమతో భోజనం చేయాలంటే సొంతగ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఆదేశించారు.

 

పాకిస్థాన్ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్‌కు చెందిన విలేకరి సాహిబ్ ఖాన్ ఓద్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఉద్యోగ జీవితం తొలుత ఇస్లామాబాద్‌లో ప్రారంభమైంది..అనంతరం హైదరాబాద్‌కు, ఈ ఏడాది ఏప్రిల్‌లో కరాచీకి బదిలీ అయ్యారు. అయితే సాహిబ్ ఖాన్ హిందువనే విషయం తెలిసిన తరువాత సహోద్యోగులు అతనిని దూరం పెట్టారు. అంతేకాదు..ఆఫీసులో భోజనం చేయాలనుకుంటే సొంతగ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఏఏపీ బ్యూరో చీఫ్ పర్వేజ్ అస్లాం ఆదేశించాడు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో అస్లాం స్పందించాడు. ఓద్ జ్వరంతో బాధపడుతున్నందునే సొంత గ్లాసు, ప్లేటు తెచ్చుకోవాలని చెప్పామని వివరించారు.