ఓటర్లకు డబ్బు పంపిణీ.. బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

 

హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసారని ఆరోపిస్తూ దాఖలైన పిటీషన్ లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తూ బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని, ఆయనపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ అప్పటి వైసీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ ఆగస్టు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరపు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఈ క్రమంలో వ్యాజ్యంలో బాలకృష్ణ వాదనలు తెలుసుకోవడం తప్పనిసరని భావించిన ధర్మాసనం  నోటీసులు జారీచేసింది.