సమగ్ర కుటుంబ సర్వే చేసుకోండి: హైకోర్టు

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకి హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. ఇప్పటికిప్పుడు సర్వేని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. ఈ విషయం మీద కృష్ణయ్య అనే న్యాయవాది హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఈ పిటిషన్ మీద న్యాయమూర్తి ఇంట్లో విచారణ జరిగింది. జీహెచ్ఎంసీ తరఫున కమిషనర్ సోమేష్ కుమార్ న్యాయమూర్తి ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర కుటుంబ సర్వేకి సానుకూలంగా హైకోర్టు స్పందించింది. సర్వే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సర్వే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే హై కోర్టుకు స్పష్టమైన వివరణ ఇచ్చిందని పేర్కొంది. జీవో నంబర్ యభైలో సర్వేకి సంబంధించిన అన్ని వివరాలనూ ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందని హైకోర్టు పేర్కొంది.