తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
posted on Aug 18, 2025 10:43AM

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వాగులూ వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి బాన్సువాడ మండలంలో సర్వపూర్ వాగ ఉధృతంగా ప్రవహిస్తోంది. మొండి సడర్.. సర్వాపూర్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో కామారెడ్డి, బాన్సువాడల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఇక బిచ్కుంద మండలం శెట్లూరు వాగులో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపర్లు, వందల గొర్రెలను రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నల్గొండలో బోరు బావి నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది.
మొత్తంగా రాష్ట్రంలో గడిచిన 12 గంటలలో భారీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట గౌరారంలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ములుగులో 18.6, ఇస్లాంపూర్ లో 17.85, కౌడిపల్లిలో 17.2, కంగ్జిలో 16.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొం ది. అలాగే శంకరంపేటలో 16.4, యాదాద్రిజిల్లా అడ్డగూడురులో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం కురిసినట్లు వెల్లడించింది.
భారీ వర్షాలకు ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో భారీగా వరద వస్తోంది. ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు.