కేటీఆర్ కోసం హస్తినకు హరీష్.. న్యాయనిపుణులతో చర్చలు!?

లొట్టపీసు కేసు, లైడిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, ఏసీబీ, ఈడీలు ఈ కేసులో నన్నేం పీకలేవు అంటూ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ ఫార్ములా రేస్ కేసులో బాగానే ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆయన ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయన్నది కేవలం పరిశీలకుల విశ్లేషణ మాత్రమే కాదు.. స్వయంగా కేటీఆర్ కూడా అదే భావిస్తున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఈ ఫార్ములా కేసును క్వాష్ చేయాలని ఆయన సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఫలితం లేకపోయింది.  ఆయనకు ఇసుమంతైనా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.

ఆయనే కాదు.. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే పనిలో ఉన్నారు. ఆయన ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీలు వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేసి అంతిమంగా అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అయితే పైకి మాత్రం బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి, కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టులో పార్టీ తరఫున పిటిషన్ దాఖలుకు వెళ్లానని చెబుతున్నారు. ఆ పిటిషన్ల కోసమైతే షరీష్ రావు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. పార్టీ తరఫున న్యాయవాదులు వెడితే సరిపోతుంది. కానీ ఆయన గురువారం (జనవరి 16) హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు.

అదే సమయంలో ఇక్కడ హైదరాబాద్ లో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఈడీ విచారిస్తోంది. దాదాపు ఏడు గంటలకు పైగా కేటీఆర్ ను విచారించిన ఈడీ, అవసరమైతే మరోసారి పిలుస్తామంటూ విచారణ ముగించి పంపించింది.  ఒక వైపు కేటీఆర్ ను విచారిస్తూనే ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించి ఆ తరువాత వైదొలగింది.ఆ కంపెనీ వైదొలగడం వల్లనే  అందుకే ప్రభుత్వం  స్పాన్సర్ షిప్  సొమ్ము చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ2, ఏ3 అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఈడీ వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తుండటమే కాకుండా, గ్రీన్ కో అనుబంధ ఏస్ నెక్స్ట జెన్ లావాదేవీలపై కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే ఏ2, ఏ3లు తమ వాంగ్మూలాలలో  మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పినట్లుగా తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు అనివార్యం అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ లో కూడా అదే ఆందోళన వ్యక్తం అవుతోంది.

దీంతో అరెస్టు నుంచి కేటీఆర్ బయట పడేందుకు ఉన్న మార్గాలపై న్యాయనిపుణులతో చర్చించేందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంలో పిటిషన్ సాకుతో హరీష్ రావు హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu