టీఆర్ఎస్ చీలికవర్గం నాయకుడెవరు?

 

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్‌ని నిట్టనిలువుగా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చాలామంది టీఆర్ఎస్‌కి పూర్తి మెజారిటీ వస్తుందని, కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. అయితే తెలంగాణలో హంగ్ రాబోతోందని , కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశం వుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. తెలంగాణలో ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంపాదించడానికి టీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చడానికి కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ప్రజా ప్రతినిధుల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించడంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన అనుభవం వుంది. ఇప్పుడీ మంత్రాన్ని ఈ ఎన్నికలలో ఎన్నికవబోతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రయోగించడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. టీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చే ఎమ్మెల్యేలకు ఒక నాయకుడు వుండాలి. ఆ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయాలి. అప్పుడే టీఆర్ఎస్‌ని చీల్చడానికి వీలవుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌ పార్టీని చీల్చడానికి ఉపయోగపడే నాయకుడిగా కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోంది. టీఆర్ఎస్‌లో హరీష్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో పెరుగుతున్నాయి. టీఆర్ఎస్‌లో ఎప్పటికైనా కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్‌దేనని హరీష్ రావుకి స్పష్టంగా తెలుసు. టీఆర్ఎస్‌లో వుండగా తాను తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అనేది ఊహల్లో తప్ప వాస్తవంలో అసాధ్యమని కూడా తెలుసు. గతంలో ఓసారి పార్టీలో కేటీఆర్‌తో వున్న విభేదాలకు చిరాకెత్తిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి, ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.