బాబు వెంటనే ఇల్లు ఖాళీ చేసి.. క్షమాపణలు చెప్పాలి!!

 

ప్రజావేదికను కూల్చి వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఏపీలోని అక్రమ కట్టడాల గురించి ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. అక్రమ కట్టడాల గురించి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజే తప్పుచేస్తే ప్రజలు చేయరా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఓ అక్రమకట్టడం అని, ఆయన వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమకట్టడంలో నాలుగేళ్లు నివసించారంటే అది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహసించినట్టేనని పేర్కొన్నారు. ఆయన చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

"ఇది తెలియక చేసిన తప్పుకాదు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో చేసిన తప్పు. మీరు, మీ మంత్రులు ఇలాంటి తప్పులు, అక్రమాలు చేశారు కాబట్టే మిమ్మల్ని ప్రజలు ఇంటికి సాగనంపారు. ప్రజావేదికను కూల్చివేసిన ఈ తరుణంలో చంద్రబాబు తను నివసించిన ఇంటిని కూలగొట్టేందుకు తానే స్వాగతించాలి. అలాకాకుండా.. నేనే ముఖ్యమంత్రిని, నేనే ప్రతిపక్షనేతని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనే ధోరణిని ప్రజాస్వామ్యంలో ఎవరూ సమర్థించకూడదు" అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.