ఇలా నియామకం.. అలా రాజీనామా!

కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ బిగ్ షాక్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను పార్టీ  అధినేత్రి సోనియా  గాంధీ నియమించారు. కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని పార్టీ అధిష్ఠానం బుధవారమే ప్రకటించింది. ఆ కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను నియమించింది. అయితే తన నియామకాన్ని   ప్రకటించిన గంటల వ్యవధిలోనే గులాం నబీ  ఆజాద్  ఆ  పదవికి  రాజీనామా చేశారు.

 అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి  కూడా ఆజాద్ రాజీనామా  చేశారు. అలాగే  క్యాంపెయిన్ కమీటీ సభ్యులలో మరో ముగ్గురు కాశ్మీరీ  నేతలకు కూ డా కమిటీకి రాజీనామాలు సమర్పించారు. ఇది నిజంగానే కాంగ్రెస్ కు తేరుకోలేని షాక్  అనే చెప్పాలి.

అసలే కాశ్మీర్ లో కాంగ్రెస్ ఉనికి అంతంత మాత్రం. ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీకి ఆజాద్ సహా నలుగురు రాజీనామా  చేయడం కాంగ్రెస్ కు తేరుకోలేని ఎదురుదెబ్బే  అవుతుందని   పరిశీలకులు అంటున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన గులాబ్ నబీ ఆజాద్ గత   కొంత  కాలంగా అధిష్ఠానం తీరు పట్ల  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడంతో మరింత రగిలిపోతున్నారు.

గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ తనకు  పదవులు అప్పగించిన సందర్భాన్ని తన అసంతృప్తిని మరింత బాహాటంగా వ్యక్తం చేయడానికి వచ్చిన  అవకాశంగా  ఉపయోగించుకున్నారు.