జీఎస్ఎల్‌వీ-ఢీ5 ప్రయోగం విజయవంత౦

 

 

 

జీఎస్ఎల్‌వీ-డీ5 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు షార్‌లోని 2వ ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించారు. జీఎస్ఎల్‌వీ-డీ5 అన్ని దశలను దాటుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకరినొకరు అభినందించుకుంటూ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలియజేశారు.


20 ఏళ్ల ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించిందని ఆయన అన్నారు. శాస్త్రవేత్తలంతా అంకిత భావంతో పనిచేశారని అన్నారు. కీలకమైన క్రయోజనిక్ ఇంజన్‌పై పట్టు సాధించామని ఆయన పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీకి ఇది ముఖ్యమైన రోజని డాక్టర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఇండియన్ క్రయోజనిక్ ఇంజన్ విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేవారు.

 ఈ ప్రయోగం ద్వారా భారత కమ్యూనికేషన్ రంగం మెరుగుపడి మరింత బలపదనుందని ఆయన అన్నారు.ఈ ప్రయోగాన్ని దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశామని, ఇస్రో చరిత్రలో ఇది 105వ ప్రయోగమని, దీని ఖర్చు విషయానికి వస్తే జీశాట్ -14 ఉపగ్రహం కోసం రూ. 45 కోట్లు ఖర్చుకాగా, మొత్తం ప్రయోగానికి అయిన ఖర్చు రూ. 205 కోట్లు అయినట్లు డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.