గూగుల్‌కి గుడ్‌బై కొట్టిన గూగుల్ ప్లస్ గుండోత్రా

 

ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ గూగుల్ నిర్వహిస్తున్న గూగుల్ ప్లస్ సృష్టికర్త, భారతీయుడు అయిన వివేక్ గుండోత్రా గూగుల్ సంస్థకు గుడ్ బై కొట్టేశారు. తాను గూగుల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన గూగుల్ ప్లస్ అకౌంట్లో మెసేజ్ పెట్టారు. మద్రాసు ఐఐటీలో చదువుకున్న గుండోత్రా 2007లో గూగుల్‌లో చేరారు. ఫేస్‌బుక్‌ తరహాలో వుండే గూగుల్ ప్లస్‌ని కనుక్కున్న ఆయన గూగుల్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నత స్థానంలో వున్నారు. గుండోత్రా గత ఎనిమిదేళ్ళుగా గూగుల్‌లో పనిచేస్తున్నారు. తాను గూగుల్‌కు ఎందుకు రాజీనామా చేస్తున్నదీ గుండోత్రా తన మెసేజ్‌లో ప్రస్తావించలేదు. గుండోత్రా రాజీనామాపై గూగుల్ సీఈఓ లారీ పేజ్ తన స్పందనను తెలియజేస్తూ, గుండోత్రా గూగుల్‌కి రాజీనామా చేయడం విచారకరమే. అయినప్పటికీ ఆయన గూగుల్‌కి, గూగుల్ ప్లస్‌కి చేసిన సేవలు సామాన్యమైనవి కావు. గూగుల్ ప్లస్ రూపకల్పనలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనదని అన్నారు.ఇప్పుడు గూగుల్ గుండోత్రా లాంటి మరో ప్రతిభావంతుడిని ‘సెర్చ్’ చేసే పనిలో వుంది.