తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స కోసం అనేక మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి లక్షల కొద్ది రూపాయలు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఆరోగ్య పథకం లో ఈ వసతి లేకపోవడంతో అనేకమంది లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాంటి వారికి కేసీఆర్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా సోకి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ.లక్ష వరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ అందివ్వనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా దీనికి సంబంధించిన మెమో జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు 25 లక్షల మంది ఉంటారు. తాజా నిర్ణయం లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.