TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారం కల్తీలో నయా మోసం: హాల్ మార్కింగ్ యంత్రాలను సైతం బురిడీ కొట్టిస్తున్న వైనం.!

Published on: Sat Nov 21, 2026 1:07PM

పసిడి కొనుగోలుదారులు, ఆభరణాల వ్యాపారులు, బులియన్ మార్కెట్ వర్గాలను  ఆందోళనకు గురిచేసే సరికొత్త బంగారం కల్తీ విధానం వెలుగులోకి వచ్చింది. చైనాలోని షెన్‌జెన్‌ నుంచి వచ్చినట్లు ఆరోపణలు ఉన్న  రెనియం  అనే లోహపు పౌడర్‌ను బంగారంలో కలపడం ద్వారా దాని బరువును కృత్రిమంగా పెంచుతున్నారు.   ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..  ఇలా కల్తీ చేసిన బంగారం హాల్ మార్కింగ్ కేంద్రాలతో సహా సాధారణ స్వచ్ఛత పరీక్షా యంత్రాలన్నింటినీ సులభంగా దాటేస్తోంది. జైపూర్‌లో నిర్వహించిన ఒక నియంత్రిత ప్రయోగంలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ ప్రయోగంలో భాగంగా 7.830 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంలో ఒక గ్రాము రెనియం పౌడర్‌ను కలిపారు. దీనివల్ల ఆ మిశ్రమం బరువు 8.830 గ్రాములకు పెరిగింది. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పరీక్షించగా..  అది 24-క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమేనని యంత్రాలు ధృవీకరించాయి. అనంతరం సంప్రదాయ రాజస్థానీ ఆభరణం ఆడ్ తయారీ కోసం మరో 0.75 గ్రాముల   లోహాన్ని కలపడంతో..దాని బరువు  9.580 గ్రాములకు చేరింది.

తయారైన ఆభరణాన్ని ఒక హాల్ మార్కింగ్ కేంద్రంలో పరీక్షించగా..  దానికి 22-క్యారెట్ల స్వచ్ఛతకు చిహ్నమైన  92K916  హాల్మార్క్ ముద్ర లభించింది. అంతేకాకుండా ప్రముఖ బ్రాండెడ్ షోరూమ్‌లోని క్యారెట్ తనిఖీ యంత్రంలో  దీనిని పరీక్షించగా, అందులో 93.70 శాతం బంగారం, 5.39 శాతం వెండి, 0.90 శాతం రాగి ఉన్నట్లు చూపించింది తప్ప రెనియం ఊసే  లేదు. వాస్తవానికి ఆ 9.580 గ్రాముల ఆభరణంలో ఉన్న అసలు బంగారం కేవలం 7.830 గ్రాములు మాత్రమే. అంటే దాని నిజమైన స్వచ్ఛత సుమారు 81.73 శాతం లేదా దాదాపు 20 క్యారెట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ ప్రయోగం ద్వారా ఆర్థికంగా కొనుగోలుదారులకు ఎంత నష్టం వాటిల్లుతుందో  తేటతెల్లమైంది. ఒక తులం బంగారం ధరను  1.5 లక్షల రూపాయలుగా పరిగణిస్తే, ఇలాంటి కల్తీ ఆభరణం కొనుగోలు వల్ల ప్రతి తులానికి సుమారు  14 వేల 700 రూపాయల మేర  నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. హాల్ మార్కింగ్ కేంద్రం, షోరూమ్‌లతో సహా ఆరు వేర్వేరు తనిఖీలను ఈ ఆభరణం ఎటువంటి అడ్డంకి లేకుండా దాటడం గమనార్హం. ఒక షోరూమ్ అయితే దీనిని 22-క్యారెట్ల బంగారంగానే భావించి తిరిగి కొనుగోలు చేయడానికి   1.17 లక్షల రూపాయలు, ఎక్స్ఛేంజ్ కింద అయితే   1.23 లక్షల రూపాయల విలువను  ఆఫర్ చేసింది.

ఈ కల్తీ వెనుక ఉన్న రసాయన శాస్త్రం, సరఫరా గొలుసు వివరాలు కూడా విస్మయం కలిగిస్తున్నాయి. స్వచ్ఛమైన బంగారం సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు సుమారు 19.3 గ్రాములు కాగా, రెనియం సాంద్రత సుమారు 21 గ్రాములుగా ఉంటుంది. బంగారానికి దాదాపు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ సాంద్రత కలిగిన భారీ లోహాన్ని కలపడం వల్ల సాధారణ యంత్రాలు సాంద్రతలోని తేడాను గుర్తించలేకపోతున్నాయి. యాసిడ్, టచ్‌స్టోన్ పరీక్షలు కేవలం ఉపరితలాన్ని మాత్రమే తనిఖీ చేస్తాయి. షోరూమ్‌లు, హాల్ మార్కింగ్ కేంద్రాల్లో వాడే ఎక్స్ రే ఫ్లోరోసెన్స్  యంత్రాలు కూడా పరికరం సామర్థ్యం, కాలిబ్రేషన్‌పై ఆధారపడి పనిచేస్తాయి తప్ప, నమూనాను కరిగించి చేసే ఫైర్ అస్సే,  ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ స్థాయిలో లోపలి మూలకాలను గుర్తించలేవు.

 ఈ రెనియం పౌడర్ సరఫరాపై జరిగిన రహస్య పరిశీలనలో షెన్‌జెన్‌లోని ఒక ఏజెంట్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. తమ సంస్థ రెనియం తయారు చేస్తుందని, దీనిని 25 శాతం వరకు బంగారంలో కలపినా గుర్తించడం అసాధ్యమని సదరు ఏజెంట్ పేర్కొన్నట్లు తెలిసింది. 100 గ్రాముల పౌడర్‌కు 3,000 నుంచి 3,400 డాలర్ల వరకు ధర చెబుతూ, ఇండియాలోని పలు నగరాల్లో ఈ రేనియంకు డీలర్లు ఉన్నారని వెల్లడించినట్లు సమాచారం. ముంబైలోని ఒక మధ్యవర్తి ద్వారా  5 వేల రూపాయలు చెల్లించి, అదనంగా  300 రూపాయల కొరియర్ ఛార్జీలతో ఒక గ్రాము నమూనాను తెప్పించి ఈ ప్రయోగం నిర్వహించారు. గతంలోనూ రుథేనియం, ఇరిడియం, ఆస్మియం వంటి భారీ లోహాల కల్తీపై ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  దృష్టికి తీసుకెళ్లింది.


ఇది కూడా చదవండి:  కుప్పకూలుతున్న పసిడి ధరలు: ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్

ప్రభుత్వ హామీకి ప్రతీకగా నిలిచే హాల్ మార్కింగ్ వ్యవస్థలోనే ఇలాంటి లోపాలు బయటపడటం పర్యవేక్షణపై సందేహాలు లేవనెత్తుతోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (  ముసాయిదా ఆడిట్ నివేదిక ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఆభరణాల వ్యాపారులలో 81 శాతం మందిపై తనిఖీలే జరగలేదు. అలాగే గుర్తింపు పొందిన అస్సేయింగ్, హాల్ మార్కింగ్ కేంద్రాల పర్యవేక్షణ లక్ష్యాన్ని బీఐఎస్ 43.7 శాతం మేర కోల్పోయింది. భారత కుటుంబాలకు బంగారం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఆపద సమయంలో ఆదుకునే పొదుపు నిధి. కొన్నేళ్ల తర్వాత ఆభరణాన్ని తిరిగి విక్రయించడానికి లేదా కరిగించడానికి వెళ్లినప్పుడు ఇలాంటి కల్తీ బయటపడితే సామాన్యులు తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా తెలియకుండా కల్తీ బంగారం కొనుగోలు చేసే చిరు వ్యాపారులు కూడా కరిగించే దశలో బరువు తగ్గి నష్టపోయే ప్రమాదం ఉంది.

దేశంలో ప్రతిరోజూ సుమారు 2వేల  నుంచి 2 వేల 200 కిలోల బంగారం వినియోగం జరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్‌పై వినియోగదారుల నమ్మకాన్ని కాపాడటం అత్యంత అవసరం. భారీ లోహాల పౌడర్లను గుర్తించే ఆధునిక పరికరాలను హాల్ మార్కింగ్ కేంద్రాల్లో అందుబాటులోకి తేవడం, తనిఖీలను ముమ్మరం చేయడం, కల్తీకి పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం తక్షణ అవసరం. ఈ కల్తీ మార్కెట్ అంతటా విస్తరించిందనే నిర్ధారణ లేనప్పటికీ, కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆభరణాలు కొనేటప్పుడు ఆరు అంకెల హెచ్ యుఐడి నంబర్ ఉన్న బీఐఎస్ హాల్ మార్క్ తనిఖీ చేయడం,  బీఐఎస్ కేర్' యాప్‌లో దానిని ధృవీకరించుకోవడం, నమ్మకమైన వ్యాపారుల వద్ద సరైన ఇన్‌వాయిస్‌తో కొనుగోలు చేయడం ద్వారా మోసాల బారి నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చు.

మీకు నచ్చవచ్చు:   బంగారం ధరలు తగ్గుదల.. పసిడి రుణాలపై బ్యాంకుల అలర్ట్!

బంగారం కొనకండి.. దేశ ప్రజలకు మోడీ మళ్లీ పిలుపు.!

 

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Gold  Adulteration, Rhenium powder, Hallmarking fraud,  BIS, precautions, Ppurchasing Gold, TeluguOne]