బంగారం కొనకండి.. దేశ ప్రజలకు మోడీ మళ్లీ పిలుపు.!
Published on: Wed Sep 2, 2026 10:39AM

ఇండియా ప్రగతి రథం పరుగులు పెట్టాలంటే.. దేశం అభివృద్ధుతున్న స్థితినుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రజా సహకారం అత్యవసరమని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఇందు కోసం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు.
అనవసరపు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. అలాగే బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని పదే పదే చేస్తున్న ఈ విజ్ణప్తులు, సూచనలు హాట్ టాపిక్ గా మారాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు, దేశ ప్రగతి, పురోగతికి ప్రధాని ప్రకటనపై ఓ వైపు హర్షం వ్యక్తం అవుతున్నా.. విమర్శలు కూడా వినవస్తున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఇండియా జిడిపి సూచీలో ఏకంగా 7.8 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన.. దేశం సాధిస్తున్న ఈ అభివృద్ధి అసాధారణమైనదని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశ ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోవడానికి పౌరులంతా మేడ్ ఇన్ ఇండియా మంత్రాన్ని జీవితంలో భాగం చేసుకోవాలన్న ప్రధాని అనవసరపు విదేశీ యాత్రలు, అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి విలాసాలకు స్వస్థి చెప్పాలన్నారు. అత్యవసరమైతే తప్ప బంగారాన్ని కొనుగోలు చేయవద్దని దేశ పౌరులకు సూచించారు. తన విజ్ణప్తిని మన్నించాలని పేర్కొన్న మోడీ, అలా చేస్తే.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి దేశాన్ని వికసిత భారత్‌గా మార్చగలమని పేర్కొన్నారు.
గతంలో కూడా ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా' ప్రాముఖ్యతను వివరించినప్పుడు విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని స్పష్టం చేశారు. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెరిగితేనే స్థానిక పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారాలు పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
[Dont Buy Gold PM Narendra Modi Calls Again, Gold Purchase Warning, Made in India Campaign, Indian Economy GDP Growth,Telugu One]


