జీహెచ్ఎంసీ ఎన్నికల సిత్రాలు.. అంతా ఉల్టా పల్టా

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక చోట పోలైన ఓట్ల కంటే బాక్సులో తక్కువ ఓట్లు ఉండగా.. మరో డివిజన్‌లో పోలైన ఓట్ల కంటే బాక్సులో ఎక్కువగా ఓట్లు ఉండటంతో గందరగోళం నెలకొంది. తాజాగా వివేకానందనగర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఈ గందరగోళం బయటపడింది. ఈ డివిజన్‌లో మొత్తం 355 ఓట్లు పోల్ కాగా బ్యాలెట్ బాక్స్ లో 574 ఓట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. జాంబాగ్ డివిజన్‌లోని బూత్ నెంబర్ 8లో మొత్తం పోలైన ఓట్లు 471 కాగా.. బాక్స్‌లో కేవలం 257 ఓట్లు ఉన్నాయి. దీంతో మిగిలిన ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. అయితే పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇవిఎం ల ట్యాపరింగ్ పై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా పేపర్ బ్యాలెట్ విధానాన్ని కూడా భ్రష్టు పట్టించే ఇటువంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతున్నాయి.

 

ఇది ఇలా ఉండగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టి వేసిన సంగతి తెలిసిందే. కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తిరిగి పరిశీలించాలని ఎన్నికల సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తోంది. ఈ రివ్యూ పిటిషన్‌ను స్వీకరించాలంటూ న్యాయస్థానానికి ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనుంది.