పవన్ కల్యాణ్ పేరు చేర్చి రెండో ఆహ్వాన పత్రం

అమరావతి పునర్నిర్మాణ పనుల పున: ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తున్న వేళ తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయా? అమరావతి పనుల పున: ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ప్రభుత్వానికీ, కూటమి పార్టీలకే ఒకింత ఇబ్బందికరంగా మారిందా? ప్రొటో కాల్ ప్రకారం ప్రభుత్వ ఆహ్వాన పత్రికలో ఉప ముఖ్యమంత్రి పేరు ఉండాల్సిన అవసరం లేదన్న అధికారుల వాదన రాజకీయ ఒత్తిడుల ముందు వీగిపోయిందా? అంటే సమాధానం ఔననే వస్తున్నది.  రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఆహ్వాన పత్రం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 
అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వాన పత్రికలు ముద్రించి, అమరావతి రైతులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలకు పంపిణీ చేసింది.   నాలుగు పేజీల ఆహ్వానపత్రంలో తొలిపేజీలో అమరావతి స్థూపం నమునా, రెండు మూడు పేజీలలో తెలుగు, ఇంగ్లీషులలో కార్యక్రమం, అతిథుల వివరాలు, నాలుగో పేజీలో అమరావతి రాజధాని ఊహా చిత్రం ఉంది. అయితే, ఈ ఆహ్వాన పత్రికలో ఉపముఖ్యమంత్రి   పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం జనసేన శ్రేణులలో ఆసంతృప్తికీ, ఆగ్రహానికీ హేతువైంది.  

ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ఏమిటని జనసైనికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.  కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేఇు తరఫున చంద్రబాబు ఉన్నప్పుడు జనసేన తరఫున పవన్ కల్యాణ్ పేరు ఎందుకు లేదు అంటూ జనసేన కార్యకర్తలు సామాజిక మాధ్యమం వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు  పవన్ కల్యాణ్‌న్ కు గౌరవం ఇవ్వకపోతే సహించేది లేదు అంటూ సామాజిక మాధ్యమంలో హోరెత్తించారు.  

కాగా ఇదే విషయం వైసీపీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది. మాజీ మంత్రి పేర్ని వంటి వారు సెటైర్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా అమరావతి అహ్వానపత్రికను పోస్టు చేస్తూ ఇందులో ఎవరి పేరో మిస్సయ్యిందంటూ వ్యాఖ్యానించారు.  అలాగే వైసీపీ సోషల్ మీడియా విభాగం అయితే ఎన్డీఏ కూటమిలో జనసేనను అణచివేస్తున్నారంటూ గుండెలు బాదేసుకుంది. 

ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఒకింత ఇబ్బంది పడాల్సి వచ్చిందనడం వాస్తవం. దీంతో వెంటనే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. పవన్ కల్యాణ్ పేరు చేర్చుతూ మరో ఆహ్వాన పత్రాన్ని ముద్రించింది. ఈ కొత్త (రెండో) ఆహ్వాన పత్రికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్లు ఉన్నాయి.  వీటిని  పంపిణీ కూడా వెంటనే ప్రారంభించేసింది. దీంతో వివాదం సద్దుమణిగింది.  

అమరావతి ఆహ్వాన పత్రికలో పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ప్రొటోకాల్ ప్రకారం కరెక్టే అయినా కూటమి పార్టీల మధ్య వివాదానికి తావు రాకూడదన్న ఉద్దేశంతో సర్కార్ వెంటనే రెండో ఆహానపత్రికను ముద్రించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.  ఈ సంఘటన కూటమిలో సమన్వయం, జనసేనకు గౌరవం వంటి అంశాలపై మరింత శ్రద్ధ అవసరమని తేలిందని పరిశీలకులు అంటున్నారు.