అప్పుడు అబ్దుల్ కలాం రాజీనామా చేయాలనుకొన్నారుట!

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006లో రాజీనామా చేయాలనుకొన్నారని ఆయన మీడియా కార్యదర్శిగా పనిచేసిన ఎస్.ఎం.ఖాన్ తెలిపారు. అప్పటి బీహార్ గవర్నర్ భూటా సింగ్ కేంద్రానికి పంపిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం బిహార్ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించుకొంది. కేంద్రమంత్రివర్గం ఆ ప్రతిపాదనను ఆమోదించి రష్యా పర్యటనలో ఉన్న అబ్దుల్ కలాంకి పంపింది. దానిని కలాం మొదట తీవ్రంగా వ్యతిరేకించారు కానీ ప్రభుత్వం నచ్చజెప్పిన మీదట దానికి ఆమోదముద్ర వేశారు. ఆ తరువాత దానిని బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో కోర్టు దానిని కొట్టివేసింది. ఆ పరిణామాలన్నీ చూసిన కలాం తను ఆ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయకుండా ఉండాల్సిందని భావించారు. జరిగిన పరిణామాలన్నీ రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించేవేనని కలాం భావించారు. అప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అనుకొన్నారు. అందుకోసం ఆయన రామేశ్వరంలో ఉన్న తన అన్నగారిని సంప్రదించారు కూడా. కానీ తను రాజీనామా చేసినట్లయితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని గ్రహించి కలాం ఆ ఆలోచనను విరమించుకొన్నారు. తనవల్ల దేశానికి మరో కొత్త సమస్య ఎదురవకూడదని ఆయన భావించారు. అందుకే తన రాజీనామా ఆలోచనను విరమించుకొన్నారు,” అని ఎస్.ఎం.ఖాన్ తెలిపారు. భువనేశ్వర్ లోని ఎస్.ఒ.ఏ. విశ్వవిద్యాలయం వారు శనివారం నిర్వహించిన “మై డేస్ విత్ గ్రేటెస్ట్ హ్యూమన్ సోల్ ఎవ్వర్” అనే కలాం స్మారక సభలో ఎస్.ఎం.ఖాన్ మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు.