కిరణ్ సర్కారుని గట్టున పడేసిన ఆహార భద్రత

 

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్వంత ఇమేజ్ పెంచుకొనేందుకు గత కొంత కాలంగా అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వేల కోట్ల వ్యయం అయ్యే ఈ పధకాలను రాష్ట్ర ఖజానాకి మోయలేని భారంగా మారినప్పటికీ, తన రాజకీయ ప్రయోజనాలకోసం, ముఖ్యమంత్రి ఇంకా కొత్త కొత్త పధకాలు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే వీటికి అవసరమయిన నిధులు ఎక్కడి నుండి రాలుతాయని ప్రశ్నించుకొంటే, అవి వివిధ రకాల పన్నుల రూపేణా మళ్ళీ ప్రజల జేబులోంచే రాబట్టక తప్పదని అర్ధం అవుతుంది.

 

ముఖ్యమంత్రి మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ‘మన బియ్యం’ అనే పధకం మొదలుపెట్టారు. ఇందులో కిలో బియ్యం రూపాయి చొప్పున దాదాపు రాష్ట్రంలో 2.26 కోట్ల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఇస్తున్నారు. ఈ బియ్యం సబ్సీడీ కొరకు రాష్ట్ర ఖజానాపై దాదాపు ఏడాదికి రూ. 9,600 కోట్ల భారం పడుతోంది. దానిని సమకూర్చుకోవడానికే తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ ఉగాది పండుగ సందర్భంగా ‘అమ్మ హస్తం’ అనే మరో కొత్త పధకం ప్రారంబించింది. ఇందులో 9 రకాల సరుకులు కేవలం రూ. 185లకే ఇస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఏడాదికి రూ. 660 కోట్ల పైమాటే. మళ్ళీ మొన్న వేల కోట్ల వ్యయం అయ్యే ‘బంగారుతల్లి’ పధకాన్ని కూడా ముఖ్యమంత్రి మొదలుపెట్టారు.

 

రాష్ట్ర ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న ఈ పధకాల భారం అంతిమంగా ప్రజలే మోయవలసి ఉంటుందనేది చేదు నిజం. అయితే, కేంద్రం మొన్న ఆహార భద్రత బిల్లుని ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఊరట లభించింది.

 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్రం ఆమోదించిన ఈ బిల్లువల్ల, ప్రస్తుతం ఈ సంక్షేమ పధకాలపై రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న ఆర్ధిక భారం సగానికి సగం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రజలకి ఆహార భద్రత కల్పించడం మాటెలా ఉన్నపటికీ, ఈ బిల్లుతో ఒడ్డుననపడిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ త్వరలో మరికొన్నికొత్త పధకాలను ప్రకటించుతారేమో.