ట్యాంకర్ ను ఢీ కొన్న కారు.. ఐదుగురు దుర్మరణం
posted on Jun 3, 2025 11:03AM
.webp)
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో సోమవారం (జూన్ 2) రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రికి చెందిన ఒక కుటుంబం సోమవారం కాకినాడ బీచ్ సందర్శనకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రంగంపేట మండలం వడిసలేరు వద్ద రహదారి పక్కన నిలిపి ఉన్న ఒక ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడిశలేరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవ్వడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
అలాగే ఈ ప్రమాదం పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలవ్వడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.