తొలి దశ ఎన్నికల పోలింగ్ షురూ!

ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది.  దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.   పటిష్ఠ భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలి దశ కోసం మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  18 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. తొలి దశలో  16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.  1,625 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగుతుంది.  

   అలాగే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌ సహా పలువురు పాప్యులర్ రాజకీయ నేతలు ఉన్నారు. 

కాగా నేడు ఓటు వినియోగించుకోనున్న 16.63 కోట్ల మందిలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 35.67 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓట్లు వేయబోతున్నారు.  

తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలో భాగంగా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అండమాన్-నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1).. అసోం, మహారాష్ట్రలో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో సీటుకు నేడు పోలింగ్ జరుగుతోంది.