ఏపీ అధికారులు కళ్ళు తెరవాలి!!

‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు. ఇంత చిన్న లాజికల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది అధికారులకు అర్థం కావడం లేదు. ఆ అధికారులలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు పలువురు ద్వితీయ, తృతీయ స్థాయి అధికారులు కూడా వున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో వున్న వైసీపీ త్వరలో అధికారం కోల్పోబోతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ, కొంతమంది అధికారులకు మాత్రం ఆ విషయం తెలియడం లేదు.. వైపీపీ శాశ్వతంగా అధికారంలో వుంటుందన్న భ్రమల్లో బతుకుతూ ఆ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.  ఐదేళ్ళుగా వైసీపీ సేవలో తరించిన అధికారగణం ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న ప్రస్తుత తరుణంలో కూడా నిస్పక్షపాతంగా పనిచేయడానికి మనసు రాక జగన్ ప్రభుత్వం సేవలో పునీతమవుతున్నారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం ఎంతమాత్రం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలోని అధికారులను చూసి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి మారాల్సిన అవసరం వుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తప్పిదాన్ని చేయించిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏమంటున్నారు? మాకేమీ సంబంధం లేదని అంటున్నారు. మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన ఇద్దరూ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఒకవేళ ట్యాపింగ్ జరిగి వుంటే, దానికి సంబంధించిన అధికారులను శిక్షించాలి అంటున్నారు తప్ప.. మేమే ట్యాపింగ్ చేయమన్నాం అని చెప్పడం లేదు. కేసీఆర్ అయితే మరింత దారుణంగా మాట్లాడారు. ప్రభుత్వ అధినేతగా నేను సమాచారం అడుగుతాను. అధికారులు ఏ మార్గంలో సమాచారం తెలుసుకుని తెచ్చి ఇస్తారో నాకు అవసరం లేదు.. నాకు సంబంధం లేదని చెప్పేశారు. అంటే, ట్యాపింగ్ చేయించిన కేసీఆర్, కేటీఆర్ చాలా తెలివిగా తప్పంగా అధికారుల మీదకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సీన్ రేపు ఏపీలో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు జగన్ మెప్పు కోసం పనిచేస్తే, రేపు అధికారం పోయిన తర్వాత జగన్ కూడా చేతులు దులుపుకుంటాడు.. నాకేం సంబంధం.. అధికారులే బాధ్యులు అనేస్తాడు. అప్పుడు దోషుల్లా నిలబడాల్సింది అధికారులే. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటేసిన ప్రజల్నే మోసం చేసిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి మమ్మల్ని మోసం చేయడులే అనుకోవడం అధికారుల అమాయకత్వం.