తండ్రులకూ కావాలి సెలవు?

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ప్రతిరోజూ పెద్దలని తల్చుకునే సంప్రదాయంలో... వాళ్ల కోసం ప్రత్యేకమైన రోజులు పెట్టడం మూర్ఖత్వం అని తిట్టేవారు లేకపోలేదు. ఫాదర్స్ డే, మదర్స్‌డే వంటి సంప్రదాయాలు పాశ్చాత్య వ్యాపార ధోరణులకు మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. నిజమే! కానీ మనిషికీ మనిషికీ మధ్య దూరం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక్క రోజైనా ఆగి బంధాల విలువల గురించి ఆలోచించడంలో తప్పులేదుగా!

సమాజం దృష్టిలో తల్లికి ఉన్నంత విలువ, గౌరవం తండ్రికి లభించదు. సాంస్కృతికంగా, సాహిత్యపరంగాను తల్లి ప్రేమ, త్యాగాల గురించే కనిపించే పొగడ్తలు, వర్ణనలు తండ్రికి మీద కనిపించవు. నిజానికి పిల్లల పెంపకంలో తండ్రి ఎవరికీ ఏమాత్రం తీసిపోడు. పిల్లల సుఖం కోసం తన కనీస అవసరాలను చంపుకునేందుకు వెనకాడడు. వాళ్ల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దడంలో దుర్మార్గుడు అన్న పేరుని సొంతం చేసుకునేందుకు జంకడు.

కొన్ని పరిశోధనల ప్రకారం పసిపిల్లల మీద తల్లికంటే తండ్రి చూపించే అనురాగమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. యూనిసెఫ్‌ అంచనా ప్రకారమైతే తండ్రితో సరైన అనుబంధం కలిగిన పిల్లల్లో ఆత్మ విశ్వాసం, పరిణతి, జీవితం పట్ల సంతృప్తి పుష్కలంగా మెరుగ్గా ఉంటాయట. కానీ ఇంటిని నడిపే బాధ్యత తండ్రిది, పిల్లల్ని సాకే బాధ్యత తల్లిది అని భావించే సమాజంలో, తండ్రి పాత్రను ఎప్పుడూ తక్కువగానే అంచనా వేస్తుంటారు. అందుకనే బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి ఆఫీసులో ఎలాంటి వెసులుబాట్లూ ఉండవు. పిల్లవాడి దగ్గర తనివితీరా ఓ వారం రోజులు గడిపేందుకు సిక్‌లీవ్‌ పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం మన దేశపు తండ్రులది. కానీ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నట్లు కనిపిస్తున్నాయి.

ఇంట్లో పిల్లల మీద తండ్రుల ప్రభావం గురించి రోజు తర్వాత రోజు వస్తున్న నివేదికలు, వినిపిస్తున్న పరిశోధనల తర్వాత... తండ్రి పాత్రకి కొత్త గుర్తింపు వస్తున్నట్లు కనిపిస్తోంది. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి కూడా కొన్ని రోజుల పాటు ‘పెటర్నటీ లీవ్‌’ ఇవ్వాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. పెటర్నటీ లీవ్‌ ఉండని 92 దేశాలలో భారతదేశం కూడా ఒకటంటూ యూనిసెఫ్‌ తరచూ గుర్తుచేస్తోంది. అందుకేనేమో ఇప్పుడు పెటర్నటీ లీవ్‌ని చట్టబద్ధం చేసేందుకు పార్లమెంటు కూడా సిద్ధమవుతోంది. అప్పుడే బిడ్డ పుట్టిన తండ్రులకు కనీసం మూడు నెలల సెలవు ప్రకటించేలా ఓ చట్టాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే పార్లమెంట సెషన్‌లో ఆ చట్టాన్ని సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారట. ఇదే కనుక జరిగితే తండ్రులకి మూడు నెలల పాటు ‘ఫాదర్స్ డే’నే!