నిజామాబాద్ లో నెగ్గేదెవ‌రు? అప్పుడు పసుపు... ఇప్పుడు గల్ఫ్‌ బోర్డు!

నిజామాబాద్ లో హోరాహోరీ సమరం సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ హేమా హేమీలే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే  ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు!  ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే..  కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!  1) కాంగ్రెస్‌ నుంచి జీవన్‌ రెడ్డి పోటీ లో ఉన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో 15,822 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.  2) బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సర్పంచ్‌ నుంచి ఆర్టీసీ చైర్మన్‌ వరకు పదవులను చేపట్టడమే కాదు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి చేతిలో దాదాపు 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.  3) బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ సిటింగ్‌ ఎంపీ. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోరుట్ల నుండి శాసనసభకు పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,305 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు.  శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన ఈ ముగ్గురూ వారి, వారి పార్టీల తరపున ఈ సారి నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, గత ఎన్నికలలో పసుపుబోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్, సొంత డబ్బులతో తెరిపిస్తానన్న షుగర్ ఫ్యాక్టరీ హామీలు ఈ సారి ఆయ‌న‌కు చిక్కులు తెస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై ప్రధానమంత్రితో ప్రకటన చేయించినా, ఆ తర్వాత ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డం,  పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి  అధికార పార్టీ గ్యారెంటీ ల్ని ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యేలా చూసుకుందామని రేవంత్ రెడ్డి జోష్ పెంచారు.   ముగ్గురూ ఉద్ధండులే కావడంతో ఇక్కడ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురికీ రాజకీయ పరపతి ఉండడం, ఆయా సామాజిక వర్గాల మద్దతు ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది.  ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి గెలుపును డిసైడ్ చేసేది గల్ఫ్‌, బీడీ కార్మికులని చెప్ప‌వ‌చ్చు.  ఉపాధి కోసం భర్తలు గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా.. భార్యలు బీడీలపై ఆధారపడి పని చేస్తున్నారు. బీడీ, గల్ఫ్‌ కుటుంబాల ఓటర్లు ఐదున్నర లక్షల వరకూ ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయం ఎన్నికల్లో కీలకం కానుంది. అందుకే, అన్ని పార్టీలూ వారిని ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నాయి.  1. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి పది రోజుల క్రితం గల్ఫ్‌ సంఘాలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వారికిచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు పునరావాసం కల్పిస్తామని, గల్ఫ్‌లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు.  అలాగే, నియోజకవర్గంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువే. బరిలో ఉన్న సిటింగ్‌ ఎంపీ అర్వింద్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికల్లో వీరి ఓట్లు గంపగుత్తగా అర్వింద్‌కు పడగా.. ఈదఫా ఇద్దరూ చీల్చుకునే అవకాశం ఉంది. పద్మశాలి ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఇక్క‌డ ఓట్లు చీలితే అది కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. 2. పదేళ్లలో వారికి కేసీఆర్‌ సర్కారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తన‌కు ఓట్లు కురిపిస్తాయని బీఆర్‌ఎస్‌ నేత భావిస్తున్నారు.  3. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా నిజామాబాద్ ఓట‌ర్ల‌ మద్దతు తమ కేనని బీజేపీ అంచనా వేసుకుంటోంది.  నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో మైనారిటీ ఓటర్లూ కీలకమే. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల వరకూ మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. సగానికి సగం ఓట్లు తమకూ వస్తాయని బీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ముస్లిం ఓట్ల చీలిక తమకు లాభిస్తుందనే బీజేపీ ధీమాగా ఉంది.  ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి. అదే నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ. ప్రతి ఎన్నికలో ఇక్కడ నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ ఎజెండాగా మారుతోంది. ఈ ఎన్నికలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే సెప్టెంబరు 17 నాటికి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డితో సహా నేతలు హామీలు ఇస్తున్నారు. చెరుకు రైతుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు.  తనను గెలిపించగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి అర్వింద్‌తోపాటు పార్టీ నేతలు హామీలు ఇస్తున్నారు. రైతులను మోసం చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ ప్రకటనలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తున్నారు నిజామాబాద్ ఓట‌ర్లు. రైతులే ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో కవిత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పసుపు బోర్డు తీసుకురాకపోవడంతో రైతులే 2019లో పోటీగా నామినేషన్లు వేశారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఏకంగా 186 మంది పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కవితను ఓడించడంతోపాటు పసుపు బోర్డు తీసుకు వస్తామన్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు పట్టం కట్టారు. ఐదేళ్ల తర్వాత పసుపు బోర్డు ప్రకటించి జీవో జారీ చేసినా.. దానిని ఎక్కడ పెడతారో ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఈసారి వారు తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్లు ఈసారి ఎవరిని గెలిపిస్తార‌నేది ఉత్కంఠ‌గా మారింది. మళ్లీ గెలిచి సత్తా చూపాలని అరవింద్‌, పార్లమెంటులో కాలు మోపాలని జీవన్‌ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్ ఈ సారి ఏ పార్టీ వైపు మొగ్గు చూప‌నున్నారనేది ఉత్కంఠ‌గా మారింది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌    
Publish Date: Apr 26, 2024 10:08AM

రెండో దశ పోలింగ్ షురూ

ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. అలాగే త్రిపుర, జమ్మూ కాశ్మీర్ లలో కూడా ఒక్కో స్థానానికి ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. రెండో దశలో మొత్తంగా 88 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న  తొలి దశలో ఈ నెల 19న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి దశలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ దశలో పోలింగ్ శాతం పెరిగేలా అన్ని చర్యలూ తీసుకుంది. ఇక బీజేపీ అయితే తొలి దశలో తమ పార్టీ పెర్ఫార్మెన్స్ పై ఒకింత అసంతృప్తితో ఉంది. దీంతో ప్రధాని మోడీ ప్రచారంలో దూకుడు పెంచారు. విపక్షాలపై విమర్శల డోస్ పెంచారు. మతపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ హిందుత్వ అజెండాను తెరపైకి తీసుకు వచ్చారు.  విపక్షాలు ఓటమి భయంతోనే మోడీ సమాజంలో విద్వేషాలు సృష్టించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.  
Publish Date: Apr 26, 2024 9:57AM

జ‌గ‌న్ పసుపు చీర వ్యాఖ్య‌లు.. చెడుగుడాడేసిన చెల్లెళ్లు

అమాయ‌కమైన ముఖం పెట్టి అబ‌ద్ధాలను అల‌వోక‌గా చెప్ప‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మించిన రాజ‌కీయ నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి  కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైన‌.. సొంత చెల్లెళ్ల‌పైన‌కూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా  చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ దిట్ట.  తాజాగా వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు విష‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదే చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌త్య‌కు గురైన వివేకా కేసులో కీల‌క ముద్దాయిగా వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నారు. సీబీఐ సైతం వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ ప్ర‌మేయం ఉంద‌ని తేల్చింది.  అంతేకాదు.. క‌స్ట‌డీలోకి తీసుకొనే ప్ర‌య‌త్నం కూడా చేసింది. కానీ  తన అధికారాన్ని ఉపయోగించుకుని జగన్  అవినాశ్ అరెస్టు కాకుండా అడ్డుప‌డిన విష‌యం   తెలిసిందే. ఒక‌వేళ ఆనాడు అవినాశ్ అరెస్ట్ అయ్యిఉంటే.. వివేకా హ‌త్య‌కేసులో జ‌గ‌న్‌, భార‌తీరెడ్డిల ప్ర‌మేయంకూడా వెలుగులోకి వ‌చ్చేది. వివేకా హ‌త్య కేసులో ప్ర‌మేయం ఉన్న అవినాశ్ రెడ్డికి జ‌గ‌న్ అండ‌గా నిల‌వ‌డంపై ఆయ‌న చెల్లెళ్లు వైఎస్ ష‌ర్మిల రెడ్డి, సునీతా రెడ్డిలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ వ‌ర్సెస్ ష‌ర్మిల, సునీత‌ల వ్య‌వ‌హారం  ఏపీ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా వివేకా హ‌త్య‌కేసు విష‌యంపై చెల్లెళ్ల వ్యాఖ్య‌ల‌కు పెద్ద‌గా స్పందించ‌ని జ‌గ‌న్‌.  పులివెందుల స‌భ‌లో ఎదురుదాడి చేశారు. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ ప్ర‌మేయం లేదంటూ .. ఆయ‌న ఓ చిన్న‌పిల్లోడు అని జ‌గ‌న్ చెప్ప‌డం అంద‌రినీ విస్మయపరిచింది. అంతేకాదు.. ప‌సుపు చీర క‌ట్టుకుంటే చంద్ర‌బాబు మ‌ద్ద‌తుదారులే అన్న‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడ‌టం చూస్తుంటే ఆయ‌నలో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా,  ఎవ‌రు ప్ర‌శ్నించినా దాని వెనుక తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఉన్నాడ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటుగా మారింది. చంద్ర‌బాబు పేరు ఎత్త‌కుండా జ‌గ‌న్ నిద్ర‌పోయిన రోజు లేద‌న‌డంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఇటీవ‌ల బ‌స్సు యాత్ర‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌గ‌న్‌పై రాయిదాడికి పాల్ప‌డ్డారు. ఆ రాయి ఎటుపోయిందో దొర‌క‌లేదు కానీ, జ‌గ‌న్ కు కంటిపై భాగంలో గాయ‌మైంది. రాయి వేయించింది కూడా చంద్ర‌బాబే అన్న‌ట్లుగా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేశారు. హత్యాయత్నం అంటూ బిల్డప్ ఇచ్చారు. అయితే చివరికి ఆ బిల్డప్ నవ్వుల పాలైంది. జగన్ ప్రతిష్టను పలుచన చేసింది. దీంతో వివేకా హ‌త్యకేసులో  అవినాశ్‌ను వెనుకేసుకొస్తున్న జ‌గ‌న్ రెడ్డిని గట్టిగా నిలదీస్తున్న తన చెల్లెళ్లు షర్మిల‌, సునీత‌లపై జగన్ ఎదురుదాడికి, దిగజారుడు విమర్శలకు, వ్యాఖ్యలకు తెగబడ్డారు. వారు సంధించే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని జ‌గ‌న్‌.. వారి వెన‌క ఉందికూడా చంద్ర‌బాబే అని పులివెందుల స‌భ‌లో మాట్లాడ‌టం ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప‌సుపుపచ్చ చీర కట్టుకొని, చంద్ర‌బాబు ఇచ్చిన స్క్రిప్ట్ లు చ‌దువుతున్నారంటూ త‌న చెల్లెళ్ల‌పై అడ్డ‌గోలుగా జ‌గ‌న్ నోరుపారేసుకున్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై అంటే రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేశార‌ని అనుచోవ‌చ్చు.. కానీ,  వివేకా హ‌త్య‌కేసులో న్యాయంకోసం పోరాడుతున్న చెల్లెళ్ల‌పైనా జ‌గ‌న్ ఇష్టానుసారంగా మాట్లాడ‌టం ప‌ట్ల‌ క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. పులివెందుల స‌భ‌లో జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత‌లు స్పందించారు.. అన్న‌మాట్లాడిన ప్ర‌తిమాట‌ను గుర్తుచేస్తూ.. దానికి స‌మాధానం చెబుతూ జగన్ ను చెడుగుడు ఆడేశారు.  ప‌సుపుపచ్చ చీర క‌ట్టుకున్న‌వారంతా చంద్ర‌బాబు మ‌నుషులే అని జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం చేశారు. నేను పసుపుపచ్చ చీర కట్టుకున్నానట, చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైటా ?   కలర్ కొన్నారా..? గతంలో సాక్షి ఛానెల్‌కి పసుపు రంగు ఉండేది కాదా..? జగన్ రెడ్డి ఈ విషయాన్ని ఎలా మరిచిపోయాడు అంటూ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ప‌సుపు మ‌నం వంట‌ల్లో కూడా వేస్తాం.. అలాని వైసీపీ శ్రేణులు ప‌సుపు వాడొద్ద‌ని జ‌గ‌న్ చెప్ప‌గ‌ల‌రా? పసుపు మంగళకర‌మైన రంగు అని స్వయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.  వైఎస్సార్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారని ష‌ర్మిల గుర్తు చేశారు. అయినా, ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్నవ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గునా అంటూ ష‌ర్మిల నిల‌దీశారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్ర్కిప్ట్ ను చెల్లెళ్లు చదువుతున్నార‌ని జ‌గ‌న్ అన‌డంపై ష‌ర్మిల మండిప‌డ్డారు. స‌భ‌లో ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్ట్ ను మ‌క్కీకి మ‌క్కీ చ‌దివే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ త‌న‌ను చూడటం లేదని అనుకుంటుంద‌ట‌.. అలా ఉంది జ‌గ‌న్ తీరు అంటూ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.  పులివెందుల స‌భ‌లో జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై వివేకానందరెడ్డి కుమార్తె సునీత‌రెడ్డికూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల రాయిదాడి ఘ‌ట‌న‌లో జ‌గ‌న్‌కు కంటి పైభాగంలో చిన్న‌ గాయ‌మైన విష‌యం తెలిసిందే. గాయ‌మై వారం రోజులు అవుతున్నా జ‌గ‌న్ క‌ట్టుమాత్రం తీయ‌డం లేదు. ఎన్నిక‌ల ప్ర‌చారం పూర్త‌య్యే వ‌ర‌కూ జ‌గ‌న్ ఆ క‌ట్టును అలానే ఉంచుతారా అనే డౌట్ ను ఏపీ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యంపై సునీతారెడ్డి మాట్లాడారు.. జ‌గ‌న్ కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది. వైద్యులు స‌రైన స‌ల‌హా ఇవ్వ‌లేద‌నుకుంటా.. జ‌గ‌న్ త్వ‌ర‌గా బ్యాండేజ్ తీయాల‌ని ఒక డాక్ట‌ర్ గా స‌ల‌హా ఇస్తున్న‌ట్లు సునీతా రెడ్డి సూచించారు. జ‌గ‌న్ పులివెందుల స‌భ‌లో ష‌ర్మిల‌ను, న‌న్ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌డం, ఐదేళ్లుగా నా తండ్రి హ‌త్య‌పై పోరాడుతుంటే రాజ‌కీయాలు అంట‌గ‌ట్ట‌డం నాకు బాధేసింది. సీఎంను ప్రాధేయ‌ప‌డుతున్నా.. ఇప్ప‌టికైనా నా పోరాటానికి స‌హాయం చేయండి అంటూ జ‌గ‌న్ రెడ్డిని సునీతా కోరారు. మొత్తానికి ఎన్నిక‌ల వేళ అవినాశ్ రెడ్డిపై ష‌ర్మిల‌, సునీత రెడ్డిలు చేస్తున్న వ్యాఖ్య‌ల్లో నిజం ఉంద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని భావించిన జ‌గ‌న్‌.. పులివెందుల స‌భ వేదిక‌గా వారిపై ఎదురుదాడి చేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని సీబీఐ చెబుతున్నా జ‌గ‌న్ మాత్రం ఆయ‌న్ను వెనుకేసుకొని రావ‌డాన్ని క‌డ‌ప ప్ర‌జ‌లు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.
Publish Date: Apr 26, 2024 9:38AM

స్నేహం, ప్రేమ మధ్య తేడా గుర్తించడం ఎలా.. ఇదిగో ఇలా!

ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే.. అసూయ చూపిస్తున్నారా? ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం. ఏకాంతం కోరుకుంటున్నారా? సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది.  పదే పదే గుర్తుచేసుకోవడం.. చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం.  ప్రాధాన్యత.. ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.                                   *నిశ్శబ్ద.
Publish Date: Apr 26, 2024 9:30AM

వేసవిలో ఖర్భూజా తింటున్నారా? ఈ నిజాలు తప్పక తెలుసుకోవాలి!

వేసవి కాలంలో అందరూ ఎం ఇష్టంగా తినే ఖర్భుజాను స్వీట్ మెలోన్ లేదా రాక్ మెలోన్ అని అంటారు. హిందీ, మరాఠీ, తెలుగులో దీనిని 'ఖర్బూజా' అని పిలుస్తారు, తమిళంలో దీనిని 'ములం పజం' అని పిలుస్తారు. బెంగాలీలు దీనిని 'ఖర్ముజ్' అని పిలుస్తారు, గుజరాతీలు దీనిని షకర్టెట్టి అని పిలుస్తారు. ప్రాంతాలు, పేర్లు ఎన్ని మారినా ఈ ఖర్భూజా మాత్రం మ్యాజిక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో దొరికే అన్ని పండ్లలోకి ఇది చాలా అద్బుతమైనది అని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఈ ఖర్భూజా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..  ఖర్భూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలను (WBC) బిల్డ్ చేస్తుంది. తద్వారా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . ఇవి సాధారణంగా మూసుకుపోయిన రంధ్రాల్లో పెరిగిమొటిమలుగా కనిపించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కూడా సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం, ఖర్భూజా, పుదీనా కాంబినేషన్ గా జ్యూస్ ప్రయత్నించవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది చక్కెర లేకుండా ఈ జ్యుస్ తీసుకుంటే కేలరీలు బెడద ఉండదు.  బరువు తగ్గించే ఆహారం తీసుకునే వారు ఎప్పుడూ రుచినిచ్చే పదార్థాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఖర్భూజా బెస్ట్ ఆప్షన్. ఇది నోటికి, కడుపుకు కూడా తృప్తిని ఇస్తుంది. దీనివల్ల బరువు పెరగరు.  కేవలం ఇదొక్కటే కాకుండా దీనితో పాటు ఇతర పండ్లను భాగం చేసుకుని ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. ఖర్భూజాలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ను నిరోధించడంలో, క్యాన్సర్ తో పోరాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.  తరచుగా నోటి పుండ్లు మరియు నమలడంలో ఇబ్బంది ఉన్నవారు క్యాన్సర్ రోగులు ఖచ్చితంగా ఖర్భుజా తీసుకోవాలి.  ఖర్భూజా పండులో కొవ్వులు ఉండవు.  ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా  ధమనులను ఆరోగ్యంగా ఉంచి గుండెను కాపాడుతుంది. శరీరానికి  సరిపడామెగ్నీషియం ఉందులో లభిస్తుంది.  ఇది హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతుంది.  ఇందులో ఉండే  పొటాషియం  రక్తపోటును నిర్వహించడానికి పని చేస్తుంది. ఎక్కువ శాతం నీటితో నిండిన పండ్లలో ఖర్భూజా ఒకటి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.  జీర్ణశయానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, నిర్విషీకరణకు సహాయపడుతుంది.  చాలామందిలో తరచుగా వచ్చే  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) తగ్గించండంలో సహాయపడుతుంది.  అసిడిటీ సమస్య ఉన్నవారికి ఖర్భూజా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఖర్భూజా కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఖర్భూజా తీసుకుంటే చాలా సేపటి వరకు ఆకలిని నియంత్రించుకోవచ్చు.  ◆నిశ్శబ్ద.
Publish Date: Apr 26, 2024 9:30AM