చంద్రబాబుకి మాజీ ప్రధాని, ప్రధాని అభ్యర్థి మద్దతు

 

విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా అంశాలలో కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ  దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందేనని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని తెలిపారు. అలాగే దీక్షకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. ‘చంద్రబాబు దీక్షకు మా పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ సంఘీభావం ప్రకటిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున డెరెక్‌ ఓ బ్రెయిన్‌ చంద్రబాబును కలిసి మా మద్దతు తెలియజేస్తారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలో ప్రతిపక్షం ఐక్యంగా ఉంటుంది’ అని సదరు టీఎంసీ నేత తెలిపారు. అంతకుముందు జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీక్షా ప్రాంగణానికి వచ్చి మద్దతు తెలిపారు.